మీ ఇంట్లో 60 ప్లస్ ఉన్నారా? కేంద్రం తాజాగా ఏం చెప్పిందంటే?

Update: 2020-06-25 04:45 GMT
ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో కేంద్రం నుంచి అరవై దాటిన వయస్కుల కోసం ‘ముఖ్య’ సూచనల పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము పేర్కొన్న అంశాల్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. గతంలో పెద్ద వయస్కుల విషయంలో సూచనలు చేసినా.. తాజాగా మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. ఈ వయస్కుల వారు ఎక్కువగా మహమ్మారి బారిన పడే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. వారి మరణాల రేటు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో మాయదారి రోగం అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంతోనూ మహమ్మారి మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. పెద్ద వయస్కుల వారంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని.. బయట వ్యక్తుల్ని కలవకూడదని పేర్కొంది. ఒకవేళ కలవటం తప్పనిసరైతే.. వారెవరైనా సరే కనీసం మీటరు దూరంలో ఉండి మాట్లాడాలే తప్పించి.. దగ్గరకు వెళ్లకూడని పేర్కొంది.

తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవటం.. ముఖాన్ని శుభ్రం చేసుకోవటం.. దగ్గినప్పుడు.. తమ్మినప్పుడు మోచేతిని అడ్డుగా పెట్టుకోవటం.. టిష్యూ పేపర్లను వాడి పారేయటం లాంటి అలవాట్లను తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పింది. ఇంట్లో వండిన వేడి భోజనాన్ని తీసుకోవాలని చెప్పింది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి తాజా పళ్ల రసాలు తీసుకోవాలని చెప్పింది. అవసరమైనప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటి శుక్లం.. మోకాలి మార్పిడి లాంటి శస్త్ర చికిత్సల్ని వాయిదా వేసుకోవాలని చెప్పింది.

పెద్ద వయస్కులు తరచూ వెళ్లే పార్కులు.. మార్కెట్లు.. గుళ్లు.. మసీదులు.. చర్చిలు.. గురు ద్వారా ఇలా ఎలాంటి ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. వీలైనంతవరకూ 60 ప్లస్ వారు మహమ్మారి అనుమానిత లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వారికి పరీక్షలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని పేర్కొంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతూ.. రోజుకు 15వేల కంటే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News