వైసీపీ వెన్నుపోటు ఇలా ఉంటుందా... ?

Update: 2021-11-11 08:30 GMT
వెన్నుపోటు అంటే చంద్రబాబుదే అంటారు వైసీపీ నేతలు. మాటకొస్తే చాలు ఆయన సొంత మామకు వెన్నుపోటు పొడిచారు అని దెప్పుతారు. సరే దాని వెనక కారణాలు వివాదాలు ఎలా ఉన్నా మాట ఇచ్చి తప్పడం వెన్నుపోటు కిందకే వస్తుంది కదా. అలా వైసీపీ కూడా టీడీపీకి గట్టిగానే వెన్నుపోటు పొడించేసింది. అది విశాఖ మహా నగరంలో. లోకల్ బాడీస్ కి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ చిత్రం చోటు చేసుకుంది. విశాఖ కార్పోరేషన్ లో 31, 61 వార్డులకు ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి. 31 వార్డులో టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో చనిపోతే 61వ వార్డులో వైసీపీ కార్పోరేటర్ దాడి సూర్య కుమారి గుండె పోటుతో మరణించారు. దాంతో రెండు చోట్ల కుటుంబ సభ్యులనే పోటీకి దించారు. దివంగత కార్పోరేటర్లకు సానుభూతిని ప్రకటిస్తూ పరస్పరం అంగీకారం చేసుకుని వైసీపీ టీడీపీ ఒకరి మీద మరొకరు పోటీకి పెట్టకూడదని ప్రకటించుకున్నాయి.

అయితే దానికి విరుద్ధంగా 31వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్ధి ఒకరికి వైసీపీ సడెన్ గా బీఫారం ఇచ్చి పోటీకి దింపడంతో టీడీపీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇదెక్కడి వెన్నుపోటు రాజకీయమని ఆక్రోశిస్తోంది. టీడీపీ మీద పోటీ పెట్టమని చెప్పి ఇపుడు ఇండిపెండెంట్ కి ఫ్యాన్ గుర్తు కేటాయించడమేంటి అని ఆ పార్టీ నాయకులు గుర్రుమంటున్నారు. దీని మీద ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా సరిగ్గా వ్యవహరించడంలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు.

ఇండిపెండెంట్ అభ్యర్ధిని వైసీపీ లోకి తెచ్చి మరీ పోటీకి దించాల్సిన అవసరమేంటి అని కూడా తమ్ముళ్ళు నిలదీస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ సిటీ ప్రెసిడెంట్ వరకూ అందరూ టీడీపీపై సానుభూతితో పోటీకి దిగమని చెప్పి మరీ చివరికి ఇలా చేయడమేంటి అని కస్సుమంటున్నారు. మొత్తానికి వైసీపీ కావాలని చేసిందా. లేక దిగువ స్థాయి నేతలు ఈ పని చేశారా తెలియదు కానీ టీడీపీని వెన్నుపోటు పొడించేసింది అన్న అపకీర్తిని మూటకట్టుకుంది. తీరా ఇండిపెండెంట్ అభ్యర్ధికి బీఫారం ఇచ్చి వైసీపీ గుర్తు కేటాయించినా ఆయన తరఫున బహిరంగంగా వైసీపీ నేతలు ఎవరూ ప్రచారం చేయలేరు, ఒకవేళ ఆ అభ్యర్ధికి తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోతే ఆ అపనింద కూడా వైసీపీ మోయాల్సి ఉంటుంది. ఎటూ సానుభూతి టీడీపీ వైపే ఉంది. మరి ఇన్ని తెలిసి కూడా వైసీపీ ఎందుకు సూప్ లో పడిందంటే సమాధానం లేదేమో. ఏది ఏమైనా అన్ని ఎన్నికలనూ గెలిచేశామని చెబుతున్నా వైసీపీకి 31వ వార్డులో వెన్నుపోటు బిరుదుతో పాటు ఓటమి అవమానం కూడా రెడీగా ఉందని తమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు.



Tags:    

Similar News