దేశంలోని నగరాల్లో ఇళ్ల ధరలు పైపైకి.. హైదరాబాద్ పరిస్థితేంటి?
అంతకంతకూ పెరుగుతున్న ధరల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోవటం అంతకంతకూ కష్టమవుతోంది.
అంతకంతకూ పెరుగుతున్న ధరల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోవటం అంతకంతకూ కష్టమవుతోంది. దేశంలోని 54 నగరాలకు సంబంధించి.. ఎక్కడ ఎంత చొప్పున ధరలు పెరిగాయన్న అధ్యయనం ఒకటి బయటకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 47 నగరాల్లో ఇళ్ల ధరలు పెరగ్గా.. మరో 7 నగరాల్లో మాత్రం ఇళ్ల ధరలు తగ్గిపోవటం గమనార్హం. ఇంటిని కొనుగోలు చేసే వేళ.. తప్పనిసరిగా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్న వేళ.. వాటి వడ్డీ రేటు కీలకంగా మారుతుంది. అయితే.. ఇప్పటికి కరోనా కంటే ముందు వడ్డీ రేట్లతో పోలిస్తే.. తక్కువగానే ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి మూడు నెలలు (త్రైమాసికం- ఏప్రిల్ -జూన్)ను చూస్తే.. మెజార్టీ నగరాల్లో ఇంటి ధరలు పెరిగాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రూపొందించిన ఈ నివేదికలో ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇంటి ధరలు పెరిగాయి. వీటిల్లో అత్యధికంగా అహ్మదాబాద్ లో 9.1 శాతం ఉంటే.. బెంగళూరులో 8.9 శాతం.. కోల్ కతాలో 7.8 శాతం పెరగ్గా.. హైదరాబాద్ లో మాత్రం 6.9 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానంలో పుణెలో 6.1 శాతం ధరలు పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయిలో ఈ పెరుగుదల 2.9 శాతం ఉండగా.. చెన్నైలో 1.1 శాతం మాత్రమే పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠంగా 0.8 శాతం మాత్రమే పెరగటం విశేషం.
ఇక.. ధరలు తగ్గిన నగరాల విషయానికి వస్తే లూధియానాలో 19.4 శాతం ధరలు తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఇక.. దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో అత్యధికంగా పుంజుకున్న నగరానికి వస్తే గురుగ్రామ్ గా చెబుతున్నారు. ఇక్కడ.. 20.1 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు. యాబై నగరాల్లో ఇళ్ల రేట్ల సగటు వార్షిక పెరుగదల 4.8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో ధరల పెరుగుదల 7 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ధరల పెరుగుదల స్థిరంగా ఉండటం చూస్తే.. ఎంత త్వరగా కొనుగోలు చేస్తే అంత మంచిదన్న భావన కలుగక మానదు.