ఎన్నారైల చూపు హైదరాబాద్‌ కాదు.. ఈ నగరం మీదే!

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో కొనగలిగే పరిస్థితులు లేకపోవడంతో ఎన్నారైలు తమ దృష్టిని బెంగళూరు వైపు మళ్లించారని తెలుస్తోంది.

Update: 2023-09-18 08:26 GMT

ఎన్నారైలు ఇటీవల తమ పెట్టుబడులను దేశంలో హైదరాబాద్‌ లో ఎక్కువగా పెట్టేవారు. ఐటీ, ఫార్మా హబ్‌ లుగా హైదరాబాద్‌ నిలవడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే దేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉండటంతో తమ పెట్టుబడులను హైదరాబాద్‌ లో పెట్టేవారు. ఎన్నారైల పెట్టుబడులన్నీ ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ లోనే ఉండేవి.

అయితే ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా భూములు తక్కువ ధరలకు లభించే పరిస్థితి లేదు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా కనీసం రూ.30 కోట్లకు తక్కువలో ఎకరం ధర లేదు. ఇటీవల కోకాపేటలో ప్రభుత్వం భూములకు వేలం వేయగా ఎకరం రూ.100 కోట్లకు పైగా అమ్ముడయిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాంతాల్లోనూ ఎకరం రూ.63 కోట్లకు అమ్ముడైంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో కొనగలిగే పరిస్థితులు లేకపోవడంతో ఎన్నారైలు తమ దృష్టిని బెంగళూరు వైపు మళ్లించారని తెలుస్తోంది. దేశంలో ప్రధాన ఐటీ నగరంగా ఉండటం, సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరు ప్రఖ్యాతులు, ఆంధ్రప్రదేశ్‌ కు బోర్డర్‌ లోనే ఉండటం, ఎక్కడి నుంచి అయినా సులువుగా వెళ్లగలిగేలా రవాణా సదుపాయాలు ఉండటం తదితర కారణాలతో ఎన్నారైలు తమ పెట్టుబడులను బెంగళూరు వైపు మళ్లించారని తెలుస్తోంది.

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, కొత్తగా ఆవిర్భవిస్తున్న ఐటీ కారిడార్లు, బెంగళూరులో శాంతిభద్రతలపరంగా అనుకూల వాతావరణం ఎన్నారైలను పెట్టుబడి పెట్టేలా ఆకర్షిస్తున్నాయి.

దీంతో 2023 ఎన్నారైలకు గొప్ప పెట్టుబడి సంవత్సరంగా నిలుస్తుందని రియల్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆసియా దేశాలు, సింగపూర్, మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్, మధ్య ప్రాచ్య దేశాల్లోని ఎన్నారైలే కాకుండా యూఎస్‌ లోని ఎన్నారైలు సైతం తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా బెంగళూరును ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్నారైలు తమ పెట్టుబడులకు తమ గమ్యస్థానాలుగా బెంగళూరు, హైదరాబాద్, పుణేలను ఎంచుకున్నారని రియల్టీ నిపుణులు చెబుతున్నారు.

బెంగళూరులో ఎన్నారైల పెట్టుబడులు గతేడాది 65 బిలియన్‌ డాలర్లు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి 80 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని బీసీడీ గ్రూప్‌ ఎండీ అంగద్‌ బేడీ అభిప్రాయపడ్డారు.

ఇటీవల కాలంలో రూపాయి విలువ పెరగడంతో బెంగళూరు, ముంబైల్లో ఎన్నారైలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఇళ్ల అమ్మకాల్లో బెంగళూరు, ముంబై సంయుక్తంగా 42 శాతం వాటాతో మార్కెట్‌ లో అతిపెద్ద నగరాలుగా నిలిచాయి. ప్రధాన నగరాల్లో 6–9 శాతం వరకు ధరలు పెరగ్గా.. బెంగళూరులో 11–12 శాతం వరకు వార్షిక పెరుగుదల ఉంది.

బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ రంగం అసాధారణ వృద్దితో చాలా మంది ఎన్నారైలు తమ పెట్టుబడులను హైదరాబాద్‌ కు బదులుగా బెంగళూరు వైపు మళ్లిస్తున్నారు.

Tags:    

Similar News