టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కు ప్రమోషన్..ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ

వచ్చే నెల మూడో వారంలో ప్రారంభమయ్యే 18వ సీజన్ లో అతడికి జట్టును నడిపించే బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-02-16 17:30 GMT

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా ఇటీవల ప్రమోషన్ కొట్టేసిన స్పిన్ ఆల్ రౌండర్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో బంపర్ ఆఫర్ దక్కనుంది. వచ్చే నెల మూడో వారంలో ప్రారంభమయ్యే 18వ సీజన్ లో అతడికి జట్టును నడిపించే బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది. అటు బ్యాట్స్ మన్ గా, ఇటు స్పిన్నర్ గా తన విధులు సమర్థంగా నిర్వరిస్తున్న అతడికి ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్సీ కూడా దక్కితే, అందులోనూ విజయవంతం అయితే తిరుగుండదనే అభిప్రాయం వినిపిస్తోంది.

17 సీజన్ల నుంచి ఐపీఎల్ లో ఉన్న్పటికీ ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ). ఈ సీజన్ లో యాక్సిడెంటల్ గా ఈ రెండు జట్లకూ కెప్టెన్లు మారనున్నారు. బెంగళూరుకు ఇప్పటికే రజత్ పటీదార్ ను కెప్టెన్ చేయగా, ఢిల్లీ కెప్టెన్ ఎవరనేది తేలాల్సి ఉంది. గత సీజన్ లో ఫ్రాంచైజీని నడిపించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. దీంతో రాబోయే సీజన్ లో ఢిల్లీని నడిపించేది ఎవరనే ప్రశ్న వచ్చింది.

ఢిల్లీకి కొన్ని సీజన్లుగా ఆడుతున్నాడు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. గత ఏడాది టి20 ప్రపంచ కప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అక్షర్.. మొన్నటి ఇంగ్లండ్ తో టి20 సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు. వన్డే సిరీస్ లోనూ బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా పంపగా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కే అవకాశం దక్కుతుందని అంటున్నాడు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. ఢిల్లీకే చెందిన ఆకాశ్.. ఇప్పుడు అనలిస్ట్ గా ఉన్నారు. తన సొంత నగరానికి చెందిన ఫ్రాంచైజీ కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ కే అవకాశం దక్కుతుందనే అంచనా వేశాడు. చూద్దాం.. మరి వచ్చే వారంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ ను ప్రకటిస్తుందో లేదో..?

Tags:    

Similar News