ఐపీఎల్ లో 12 ఏళ్లుగా ఇది ‘గేల్ మార్క్’.. దీనిని బద్దలు కొట్టేవారున్నారా?

గత సీజన్ లో జట్టుపరంగా 287 పరుగుల అత్యధిక స్కోరు.. దీనిని ఈ ఏడాది తొలి మ్యాచ్ లోనే బద్దలు కొట్టినంత పని చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ, రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది.;

Update: 2025-03-26 11:20 GMT
Chris Gayle Unbeatable Record Not Break

గత సీజన్ లో జట్టుపరంగా 287 పరుగుల అత్యధిక స్కోరు.. దీనిని ఈ ఏడాది తొలి మ్యాచ్ లోనే బద్దలు కొట్టినంత పని చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ, రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇదే కాదు.. ఈ ఏడాది సన్ రైజర్స్ 300 పరుగులు సాధిస్తుందనే అందరూ భావిస్తున్నారు. అయితే, జట్టుగా సన్ రైజర్స్ రికార్డు ఓకే.. మరి ఐపీఎల్ లో వ్యక్తిగత అత్యధిక స్కోరు ఎవరిదో తెలుసా?

బహుశా ఎప్పుడో 12 ఏళ్ల కిందట నమోదైంది కాబట్టి అందరూ మర్చిపోయి ఉంటారు.. ఆ ఆటగాడు ఐదారేళ్లుగా ఐపీఎల్ ఆడడం లేదు కాబట్టి ఎవరూ పట్టించుకుని ఉండరు. కానీ, అతడి రికార్డు మాత్రం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాదని మాత్రం చెబుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే రికార్డుల జాతర. అలాంటి లీగ్ లో బ్రేక్ చేసేందుకు అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. వాటిలో వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ నమోదు చేసిన 175 నాటౌట్ రికార్డు.

2013లో పూణే సూపర్‌జెయింట్స్ అని ఒక జట్టు ఉండేది. వాస్తవానికి ఇది చెన్నై సూపర్ కింగ్స్. కొన్నికారణాల వల్ల నిషేధం పడడంతో రెండేళ్లు పుణె పేరిట ఆడింది. 2013లో ఇలానే బరిలో దిగి గేల్ చేతిలో బలైంది. అన్నట్లు పుణె జట్టుకూ మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్.

2013 సీజన్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలో దిగిన క్రిస్‌ గేల్‌ (175 నాటౌట్) తుపాను ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రయిక్‌ రేట్‌ 265.15. కాగా, గేల్ రికార్డు 12 ఏళ్లయినా బద్దలవుతుందని చెప్పలేకున్నారు. అప్పటినుంచి కొన్ని పదుల సెంచరీలు నమోదైనా గేల్ ను మాత్రం అందుకోలేకపోయారు.

అయితే, ఈ సీజన్ లోనూ గేల్ రికార్డు భద్రమే అని అనిపిస్తుంది. కారణం.. అప్పటికీ, ఇప్పటికీ వికెట్లు, బ్యాటింగ్ తీరు మారడమే. కానీ, ఇన్నింగ్స్ ఆసాంతం ఆడే వారు తక్కువ. అభిషేక్ శర్మ వంటి కుర్రాళ్లే కాదు రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ఉన్నా మహా అయితే 150 కొట్టగలరేమో? కానీ, 175 వరకు రావడం అంటే కష్టమే..? అలాగని అసాధ్యం అని చెప్పలేం.

Tags:    

Similar News