ఐపీఎల్ మెగా వేలం..అయ్యర్ రూ.26.75 కోట్లు..పంత్ 27 కోట్ల రికార్డు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం మార్మోగుతోంది.. రూ.కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుక్కునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.

Update: 2024-11-24 11:26 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం మార్మోగుతోంది.. రూ.కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుక్కునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. జెద్దాలో ఆది, సోమవారాల్లో సాగే ఈ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. నిరుడు మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (రూ.20 కోట్లు), మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) ను అత్యంత ఖరీదైన రేటుకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక ధర దక్కిన ఆటగాళ్లు వీరే. అయితే, ఆ రికార్డును ఈ మెగా వేలంలో ఇద్దరు భారత ఆటగాళ్లు బ్రేక్ చేశారు.

పంత్ పై కాసుల పంట

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల కిందట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడమే అద్భుతం. దాదాపు 16 నెలల అనంతరం ఈ ఏడాది ఐపీఎల్ లో పునరాగమనం చేసిన పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా కొనసాగించింది. అయితే, ఇటీవలి రిటెన్షన్ జాబితాలో మాత్రం కొనసాగించలేదు. దీంతో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో మెగా వేలంలోకి వచ్చాడు పంత్. అతడిపై ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లతో కాసుల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

అంతకుముందు అయ్యర్

పంత్ కు ముందు వేలంలోకి వచ్చిన టీమ్ ఇండియా బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ కూ పంట పండింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వచ్చిన అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. దీంతో పంత్ కంటే ముందే రూ.25 కోట్ల మార్క్ దాటిన ఆటగాడిగా, అత్యధిక ధర దక్కినవాడిగా నిలిచాడు. కానీ, పంత్ రూ.27 కోట్లకు అమ్ముడవంతో ఈ రికార్డు వెనక్కు పోయింది. కాకపోతే అయ్యర్ కు రెండో గరిష్ఠ ధర రికార్డు దక్కవచ్చు.

రూ.18 కోట్లతో అర్షదీప్ పంజాబ్ కే..

టీమిండియా టి20 ఫార్మాట్ లో ప్రధాన ఆటగాడైన పేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. రూ.18 కోట్లతో అతడిని రైట్ టు మ్యాచ్ ద్వారా పాడుకుంది. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ, ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు జోస్ బట్లర్‌ ను రూ.15.75 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకున్నాయి.

Tags:    

Similar News