డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా..టీమ్ ఇండియాకు కంగారూ తోక అడ్డంకి

దురదృష్టాఫ్రికాగా పేరున్న ఆ జట్టుకు ఈసారి అదృష్టం కలిసొచ్చింది.. సొంతంగా రాణించినదాని కంటే అవతలి జట్టు ఓటమి పాలవడం మేలు చేసింది.

Update: 2024-12-11 09:30 GMT

నిన్న మొన్నటి వరకు ఆ జట్టు పేరే వినిపించలేదు.. కానీ, ఇప్పుడు ఏకంగా ఫైనల్ కు చేరింది.. అదికూడా మిగతా జట్ల కంటే ముందే తన బెర్తును ఖాయం చేసుకుంది. ఇప్పటివరకు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరని ఆ జట్టు.. ఇటీవల టి20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమ్ ఇండియా చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పుడు అదే టీమ్ ఇండియాను వెనక్కునెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది

ఈసారి అదృష్టం కలిసొచ్చి..

దురదృష్టాఫ్రికాగా పేరున్న ఆ జట్టుకు ఈసారి అదృష్టం కలిసొచ్చింది.. సొంతంగా రాణించినదాని కంటే అవతలి జట్టు ఓటమి పాలవడం మేలు చేసింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు దూసుకెళ్లింది. ఇదెలా జరిగిందంటే.. స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ను 2-0తో దక్షిణాఫ్రికా నెగ్గింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో 63.33 శాతంతో టాప్ లోకి వెళ్లింది. కేవలం మరొక్క మ్యాచ్‌ లో విజయం సాధించినా చాలు.. ఫైనల్‌ బెర్తు ఖాయం అవుతుంది. అయితే, ఈ నెలాఖరులో సొంత గడ్డపై పాకిస్థాన్‌ తో రెండు టెస్టులు ఆడనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మంచి ఫామ్ లో ఉంది. ఈ నేపథ్యం పాక్ పై నెగ్గడం పెద్ద కష్టమేం కాదు. కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖాయం.

భారత్ కు మేలే కానీ..

అనూహ్యంగా దక్షిణాఫ్రికా ఫైనల్ చేయడంతో భారత్ కు కొంత మేలే జరిగింది. సఫారీలు టాప్ లోకి రావడంతో ఆస్ట్రేలియా

(60.71) రెండో స్థానానికి పడిపోయింది. గులాబీ టెస్టులో ఓడిన భారత్ (57.29) మూడో స్థానానికి దిగింది. మొన్నటి వరకు శ్రీలంక (45.45) పోటీలో నిలిచినా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ లకు మాత్రమే ఫైనల్ చేరే చాన్సుంది.

హ్యాట్రిక్ కొట్టాలంటే..

గత రెండు సైకిల్స్ (2019-21), (2021-23)లో ఫైనల్ చేరిన భారత్ కు ఈసారి సమీకరణాలు క్లిష్టంగా మారాయి. కారణం.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడుకు మూడు టెస్టులు ఓడడమే. అయితే, ఆస్ట్రేలియాపై తొలి టెస్టు నెగ్గడంతో ఆశలు చిగురించాయి. రెండో మ్యాచ్ లో ఓడినా.. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచ్‌ లు గెలిస్తే నేరుగా ఫైనల్‌ కు వెళ్తుంది. కాకపోతే.. ఒక్కటి ఓడినా పరిస్థితి క్లిష్లం అవుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ సిరీస్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం బోర్డర్ – గావస్కర్ సిరీస్ లో భారత్‌ 3-2తో గెలిచినా 64.05 శాతంతో ఫైనల్‌ చేరుతుంది. 3-1తో నెగ్గితే పాయింట్లు 60.52 శాతం అవుతాయి. 2-2తో డ్రా అయితే భారత్ ఫైనల్ అవకాశాలు తగ్గుతాయి. కాగా, ఆస్ట్రేలియా తదుపరి శ్రీలంకతో ఆడాల్సి ఉంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయి శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0తో గెలిస్తే భారత్ ఇంటికెళ్లడమే. అదే ఐదు టెస్టుల సిరీస్‌ ను 3-2 లేదా 3-1తో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్‌ కు చేరుతుంది. ఒక మ్యాచ్‌ డ్రా అయినా అవకాశాలుంటాయి. రెండింటిలో ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు గల్లంతయినట్లే. అంటే మిగతా మూడు మ్యాచ్‌ లలో అన్నీ గెలవాలి లేదా ఒకటి డ్రా చేసుకుని, రెండింట్లో నెగ్గాలి. భారత్‌ 4-1తో గెలిస్తే 64.05 పాయింట్ల శాతంతో, 3-1తో నెగ్గితే 60.52 పాయింట్ల శాతంతో ఆసీస్‌ ను దాటి టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ 2-2తో డ్రా అయినా రోహిత్‌ సేనకు అవకాశం ఉంది. అప్పుడు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను శ్రీలంక 2-0తో వైట్‌వాష్‌ చేయాలి. రెండు మ్యాచ్ లనూ డ్రాగా ముగించినా ఫర్వాలేదు. అప్పుడు ఆసీస్, భారత్‌ 55.26 పాయింట్ల శాతంతో సమానంగా ఉంటాయి. ఎక్కువ సిరీస్‌ విజయాలతో టీమ్‌ ఇండియా ముందంజ వేస్తుంది.

Tags:    

Similar News