రెండో టీ20లో భారత్ సూపర్... తెలుగు కుర్రాడి సెలబ్రేషన్స్ వైరల్!
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 55 బంతులు ఆడి 4 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 72 పరుగులు చేశాడు.
ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్ట్ సిరీస్ లలో సీనియర్ లు విఫలమైనా.. టీ20 మ్యాచ్ లలో టీమిండియా కుర్రాళ్లు మాత్రం జోరు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాడ్ తో జరుగుతున్న సిరీస్ లోని రెండో టీ20లోనూ విజయం సాధించారు. దీంతో.. సిరీస్ లో 2-0తో ముందంజలో ఉన్నారు. ఈ మ్యాచ్ లో హీరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!
అవును.. ఇంగ్లాండ్ తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లిష్ బ్యాటర్స్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ లు తలో నాలుగేసి పరుగులు చేసి వెనుదిరిగారు.
ఇదే సమయంలో.. హ్యారీ బ్రూక్ (13), లివింగ్ స్టన్ (13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో.. జోస్ బట్లర్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్) - 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. బ్రైడన్ కార్సే (31), జేమీ స్మిత్ (22) దుకుడుగా ఆడారు. దీంతో... గౌరవప్రదమైన స్కోరు లభించింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలో రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికేట్ సాధించారు.
ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 55 బంతులు ఆడి 4 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 72 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. మైదానం నలుమూలలా తిలక్ వర్మ చూడచక్కటి షాట్లు ఆడాడు!
మరోపక్క వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 26 పరుగులతో రాణించాడు. ఐతే... అభిషేక్ శర్మ (12), సూర్యకుమార్ యాదవ్ (12) పరుగులు చేయగా.. హార్దిక్ పాండ్యా (7), సంజూ శాంసన్ (5), ధ్రువ్ జురెల్ (4), అక్షర్ పటేల్ (2) నిరాశపరిచారు. తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.
ఇదంతా ఒకెత్తు అయితే.. విజయం అనంతరం మైదానంలో తిలక్ వర్మ చేసిన సంబరాలు మరొకెత్తు అన్నట్లుగా ఉన్నాయి. గాల్లోకి ఎగిరి పంచు కొట్టి, సెల్యూట్ చేస్తున్నట్లు నిల్చుని వర్మ చేసిన సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పాలి. ఈ సందర్భంగా స్టేడియం మొత్తం తిలక్ వర్మ కు అభినందనలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.