మిషన్ రాణిగంజ్ టీజర్: రెస్క్యూ ఆపరేషన్ మైండ్ బ్లోయింగ్
ఖిలాడీ అక్షయ్ కుమార్ కి సరైన పాన్ ఇండియా హిట్ సాధించడం ఎలానో ఓ పట్టాన అంతు చిక్కడం లేదు.
ఖిలాడీ అక్షయ్ కుమార్ కి సరైన పాన్ ఇండియా హిట్ సాధించడం ఎలానో ఓ పట్టాన అంతు చిక్కడం లేదు. ఇలాంటి సమయంలో అతడు వైవిధ్యమైన కంటెంట్ తో ఒక ప్రయత్నం చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. ఈసారి అతడు నటిస్తున్న చిత్రం ఒక ఇంట్రెస్టింగ్ మిషన్ నేపథ్యంలో సాగనుంది. `మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ` అనేది ఈ సినిమా టైటిల్. టైటిల్ కి తగ్గట్టే తాజాగా చిత్రబృందం ప్రభావవంతమైన టీజర్‌ను విడుదల చేసింది. ఇది అసాధారణం అద్భుతం అని పొగిడేయలేం .. కొత్తదనం నిండిన కథాంశం కూడా కాదు. ఈ తరహాలో గతంలో చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. భారతీయ పరిశ్రమల్లోను ఇలాంటి సినిమాలు తెరకెక్కాయి. రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో ఇది మరో సినిమా అని మాత్రమే భావించాలి. కానీ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
ఈ చిత్రం రాణిగంజ్ కోల్‌ఫీల్డ్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. భారత్ కి చెందిన బొగ్గు గని రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించిన దివంగత శ్రీ జస్వంత్ సింగ్ గిల్ వీరోచిత పోరాటం నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్న చిత్రమిది. 1989 నవంబర్‌లో రాణిగంజ్‌లోని వరదల్లో బొగ్గు గనిలో చిక్కుకుని బతికి ఉన్న మైనర్లందరినీ రక్షించడంలో వీర జస్వంత్ సింగ్ గిల్ (అక్షయ్ కుమార్ ఈ పాత్రను పోషించాడు) ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన రెస్క్యూ మిషన్‌గా చరిత్రకెక్కింది.
ఇది సాధించలేనిదిగా అనిపించిన భారీ మిషన్.. కానీ సాధించి చూపిస్తారు. మిషన్ రాణీగంజ్ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంది. సస్పెన్స్, థ్రిల్స్.. డేర్ డెవిల్ ఫీట్స్ తో ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని టీజర్ భరోసానిచ్చింది. బొగ్గు గనిలో సవాళ్లను అధిగమించాలనే సంకల్పంతో కార్మికుల మనోధైర్యం టీజర్ లో ఎంతో ఆకట్టుకుంటోంది. అక్షయ్ హీరోచిత ప్రయత్నాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. మిషన్ రాణిగంజ్ టీజర్ చాలా ఆసక్తిని పెంచింది. మిషన్ రాణిగంజ్‌తో సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ తన ఉత్తమ ప్రదర్శనను ఇస్తాడని ఈ టీజర్ వీక్షించిన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లింగ్ టీజర్.. ఈ జానర్ అక్షయ్ కే చెందినదని నిరూపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలో అక్షయ్ నటించిన సినిమాలు అన్నివేళలా కచ్చితంగా హిట్ అయ్యాయి. టీజర్ ఇంపాక్ట్ చూస్తే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని ధీమా పెరుగుతోంది.
వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ , అజయ్ కపూర్‌లు నిర్మించిన ఈ చిత్రానికి టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించారు. దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించిన రాణీగంజ్ బొగ్గు గని ప్రమాదంలో జస్వంత్ సింగ్ గిల్ నేతృత్వంలోని రెస్క్యూ టీమ్ ఎలా స్పందించింది? ఎలాంటి సాహసాలు చేసింది? అన్నది తెరపైనే చూడాలి. 6 అక్టోబర్ 2023న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు.