రాహుల్ గాంధీని ఫాలో ఫాలో... బైక్ రిపేరర్ గా మారిన లోకేష్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన పనులూ లోకేష్ చేయడం విశేషం
తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు రాజకీయ జీవితం మీద ఎవరి ప్రభావం ఉంది అన్నది చెప్పలేం కానీ ఆయన తనయుడు లోకేష్ మాత్రం అందరికీ ఫాలో ఫాలో అంటున్నారు. ఆయన ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ తో పాటు జాతీయ నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కూడా అనుకరిస్తూ పోతున్నారు.
ఎప్పటికి ఏ వేషం అవసరమో గుర్తించి దానికి తగినట్లుగా లోకేష్ తన యాక్టివిటీని మార్చుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రలో కొన్ని సార్లు పవర్ ఫుల్ డైలాగ్స్ పేల్చుతూ పవన్ ని అనుకరిస్తున్నారు. పవన్ ఒక సందర్భంగాలో భయం అంటే జగన్ సహా వైసీపీ నేతలకు చూపిస్తామని అన్నారు. అచ్చం అదే డైలాగ్ ని లోకేష్ కాపీ కొట్టినట్లుగా ప్రకాశం జిల్లాలో సౌండ్ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ ఏకవచన ప్రయోగంతో జగన్ని చాలెంజి చేస్తూ వారాహి సభల్లో ప్రసంగించారు. అదే తీరున లోకేష్ కూడా రెస్పాండ్ అవుతూ జగన్ అంటూ సవాల్ చేశారు. ఇక జగన్ స్టైల్ లో పాదయాత్ర చేస్తూ కొన్ని సార్లు కనిపించారు. ఇపుడు రాహుల్ గాంధీని అనుకరిస్తూ ఒక బైక్ మెకానిక్ దుకాణాన్ని లోకేష్ బాబు సందర్శించి అక్కడ వారితో భేటీ వేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన పనులూ లోకేష్ చేయడం విశేషం. ఇక ముస్లిం లీగ్ కి రాహుల్ సర్టిఫికేట్ ఇచ్చి మైనార్టీలను అక్కున చేర్చుకునేకార్యక్రమం చేపడితే లోకేష్ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏకంగా ఇస్లామిక్ బ్యాంకులనే ఏర్పాటు చేస్తామని చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
ఇటీవల రాహుల్ గాంధీ ఒక బైక్ గ్యారేజి సందర్శించారు. అక్కడ ఆన బైక్ మెకానిక్స్ తో మాటా మంతీ చేశారు స్క్రూలు తిప్పడంతో పాటు బోల్టులు బిగించి బైక్స్ ని రిపేరు చేసే పనిలో కూడా రాహుల్ పాలుపంచుకున్నారు. అలా వారికి అసిస్టెంట్ గా రాహుల్ పనిచేసిన తీరు అందరినీ అకాట్టుకుంది. మంచి మైలేజ్ వచ్చింది. పొలిటికల్ గా వైరల్ అయింది.
ఇపుడు చూస్తే లోకేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పాదయాత్రలో భాగంగా సంతనూతల పాడులో పట్టణంలో బైక్ మెకానిక్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. బైక్ మెకానిక్ దుకాణాన్ని ఆయన సందర్శించారు. వారు చెప్పినది ఓపికగా వింటూ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని బైక్ మెకానికుల కోసం ఏకంగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని లోకేష్ చెప్పడం విశేషం.
అంతే కాదు బైక్ మెకానిక్ ల గురించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వారి షాపులు ఎనిమిది లక్షల దాకా ఉన్నాయని లోకేష్ చెప్పారు. వాటి ద్వరా పది లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి దక్కుతోంది అని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వంలో స్వయం ఉపాధి రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందని, సొంతంగా దుకాణాలు పెట్టుకుని ఉపాధి పొందుతున్న వారు అంతా నానా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ విమర్శించారు.
ఇక టీడీపీ 2024లో అధికారంలోకి వచ్చాక వారి జీవితాలను మెరుగులు దిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. మొత్తం మీద చూస్తే లోకేష్ పాదయాత్ర లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాదిరిగా కొన్ని విన్యాసాలు చేస్తున్నారు. ఇవన్నీ సరే కానీ ఇంతకీ లోకేష్ స్టైల్ ఏంటి ఆయన వే ఆఫ్ స్పీచ్ ఎలా ఉంటుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు రాజకీయ వ్యక్తిత్వం ఇవన్నీ జనాలకు ఏమిటి అన్నది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే లోకేష్ ఇప్పటికీ ఫాలో ఫాలో అంటూ తండ్రి చంద్రబాబు నుంచి అందరి నాయకులను అనుసరిస్తూనే పోతున్నారు కాబట్టి, రాజకీయాల్లో అనుకరణ పనిచేయదు, అనుసరణ అయితే బెటర్. మరి చినబాబుకు ఇవన్నీ చెప్పే వారు ఎవరు అని అంటున్నారు.