జగన్ తో విజయమ్మ.. వివాదాలకు ఫుల్ స్టాప్!?
జగన్ బాబాయ్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రంరెడ్డి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మరణించారు.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ మధ్య రాజీ కుదిరిందా? సర్వసతి పవర్ వాటాల విషయంలో వివాదంపై కోర్టుకెక్కడంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే మంగళవారం తల్లిబిడ్డలు ఇద్దరూ కలిసి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి రావడంతో జగన్, విజయమ్మ మధ్య వివాదం సమసిపోయిందా? అనే చర్చకు తెరలేచింది.
జగన్ బాబాయ్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రంరెడ్డి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో మరణించారు. ఆమె భౌతిక కాయాన్ని సుబ్బారెడ్డి సొంత గ్రామం మేదరమెట్లకు తరలించగా, ఆమెకు నివాళులర్పించేందుకు మాజీ సీఎం జగన్ వచ్చారు. ఆయనతోపాటే వైఎస్ విజయమ్మ కూడా మేదరమెట్ల రావడంతో వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. సరస్వతి పవర్ వాటాల విషయంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో జగన్ కు విభేదాలు ఉన్న విషయం విదితమే.
ఈ వివాదం నేపథ్యంలో జగన్, విజయమ్మ కలవడం కూడా మానేశారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలుస్తున్న విజయమ్మ కుమారుడు జగన్ ను దూరం పెట్టారని చెప్పేవారు. కానీ, తల్లి, కుమారుడు ఇద్దరూ కలిసి మేదరమెట్ల రావడంతో ఆ ప్రచారంలో నిజం లేదని భావించాల్సివుందంటున్నారు.
విజయమ్మ సోదరి వైవీ సుబ్బారెడ్డి భార్య కావడంతో ఇరు కుటుంబాలకు దగ్గర బంధుత్వం ఉంది. అంతేకాకుండా వైసీపీలో సుబ్బారెడ్డి కీలక నేతగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆగమేఘాల మీద జగన్ మేదరమెట్ల వచ్చారు. పిచ్చమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబాయ్ సుబ్బారెడ్డిని పరామర్శించారు.