తిరుమలలో చంద్రబాబు స్పెషల్ డే

ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులుతోపాటు మంత్రి లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా తిరుమల వస్తున్నారు.;

Update: 2025-03-18 11:10 GMT

శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న కుటుంబ సమేతంగా తిరుమల వస్తున్నారు. 21న వేకువజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతేకాకుండా ఆ రోజు శ్రీవెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు పంపిణీ చేసే అన్నప్రసాదం, అల్పాహారం ఖర్చు అంతా ముఖ్యమంత్రి కుటుంబమే భరించనుందని చెబుతున్నారు. భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి స్వయంగా వడ్డించనున్నారు. చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 21న ముఖ్యమంత్రి కుటుంబం తిరుమలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులుతోపాటు మంత్రి లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా తిరుమల వస్తున్నారు. 21న దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆ రోజు అన్నదానానికి అయ్యే ఖర్చును కూడా చంద్రబాబు కుటుంబమే భరిస్తోంది. ఏటా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన కొనసాగించాలని నిర్ణయించారు.

కాగా, ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటలు పడుతోంది. సోమవారం 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. సుమారు రూ.3.80 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 25 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో ఉన్నవారిని టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు.

Tags:    

Similar News