జ్యోతిష్యుల పోల్స్... ఏ జోతిష్యం ఎవరికి అనుకూలం అంటే...?

ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది బల్లగుద్ది చెప్పలేని స్థితి అని అంటున్నారు.

Update: 2024-06-01 06:17 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13నే ముగిసింది. అయితే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు అన్ని విడతల్లోనూ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించుకోవచ్చనే నిబందన ఉండటంతో.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఈ పోల్స్ పై తీవ్ర ఉత్కంట నెలకొంది. అయితే... ఈ రోజుతో చివరి విడత పోలింగ్ ముగుస్తుండటంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలుకాబోతుంది.

ఆ సంగతి అలా ఉంటే... ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి నిబంధనలు ఉన్నప్పటికీ... జోతిష్యుల పోల్స్ కి ఎటువంటి నిబంధనలూ లేకపోవడంతో ఇన్ని రోజులూ వారి అంచనాలు హల్ చల్ చేశాయి. ప్రధానంగా ఈసారి 2019తరహాలో ఫలితాలపై ఎలాంటి క్లారిటీ లేకుండా.. వార్ వన్ సైడ్ అనే కామెంట్లు వినిపించకుండా.. ఎక్కడ చూసినా టఫ్ ఫైట్ అనే చర్చ తెరపైకి వచ్చిన పరిస్థితి!

ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనేది బల్లగుద్ది చెప్పలేని స్థితి అని అంటున్నారు. దీంతో... జోతిష్యుల పోల్స్ పైనా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఇప్పుడు జోస్యాలు చేబుతున్న వారు గతంలోనూ ఫలితాలతో పాటు పలు విషయాలపై చెప్పిన ఫలితాలు నిజం అవ్వడంతో వారి అంచనాలపైనా ఆసక్తి నెలకొంది. వీరిలో ప్రధానంగా గోదావరి జిల్లాల వారుండటం గమనార్హం.

అవును... సాధారణంగా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు గోదావరి జిల్లాల ప్రజానికం ఎటువైపు ఉన్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటుంది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని 34 స్థానాలూ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తాయని చెబుతుంటారు. ఇక్కడ నుంచే వేవ్ అనేది క్రియేట్ అవుతుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతుంటారు.

ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని అమ‌లాపురానికి చెందిన ఉపదృష్ట నాగాదిత్య ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జోతిష్యం చెప్పారు! వంశ పారంప‌ర్యంగా ఈ రంగంలో ఉన్న వారు.. అనేక మంది సినీ తార‌ల‌కు కూడా జాత‌కాలు చెప్పారు. ఈయన అంచ‌నా ప్రకారం.. ఏపీలో కూటమికి 135 సీట్లు వచ్చే అవకాశం ఉండగా.. వైసీపీకి ఎదురీత తప్పదు!!

ఇదే క్రమంలో ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడేనికి చెందిన క‌ప్పగంతు శ్రీరామ‌కృష్ణ శ‌ర్మ.. ప్రముఖ జ్యోతిష్యులుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. త‌ర‌త‌రాలుగా జ్యోతిష్యం చెప్పడం, పంచాంగం రాయ‌డంలో వీరు నిష్ణాతులని అంటుంటారు. ఈ క్రమంలో తాజా ఎన్నిక‌ల‌ ఫలితాలపై స్పందించిన ఆయన... వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు.

ఇక... సెలబ్రెటీస్ జోతిష్యుడిగా పేరు సంపాదించుకున్న వేణుస్వామి కూడా ఈ ఎన్నికల ఫలితాలపై గతకొన్ని రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్ లో జోతిష్యం చెబుతున్నారు! ఇందులో భాగంగా ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమని.. మరోసారి జగన్ సీఎం అవుతారని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు! మరి వీరి జోతిష్యాల్లో ఎవరి జోస్యం ఎంతవరకూ నిజమవుతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News