పిచ్చ పీక్స్.. డ్రాగన్ దేశంలో జాతకాల్ని చూసి జాబ్ లు!
లక్కీ నెంబర్లు.. రంగులు.. తేదీల వరకు విస్తరించిన ఈ నమ్మకాలతో పాటు ఫెంగ్ షుయ్ సంప్రదాయాల్ని సైతం కార్పొరేట్ నిర్ణయాల్లో పక్కాగా పాటిస్తున్నారు.
నమ్మకాలు మామూలే. అయితే.. ఇప్పుడు చెప్పే నమ్మకం గురించి తెలిసిన తర్వాత నోటి నుంచి వచ్చే మొదటి మాట.. పిచ్చ పీక్స్ కు చేరుకుందిగా అనిపించకమానదు. డ్రాగన్ దేశంలో మూఢనమ్మకాల పిచ్చ అంతకంతకు ముదురుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ దిశగా వెళుతున్న ఆ దేశంలో.. అందుకు భిన్నంగా మూఢనమ్మకాల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చివరకు కార్పొరేట్ ప్రపంచాన్ని కూడా అది వదలట్లేదు.
లక్కీ నెంబర్లు.. రంగులు.. తేదీల వరకు విస్తరించిన ఈ నమ్మకాలతో పాటు ఫెంగ్ షుయ్ సంప్రదాయాల్ని సైతం కార్పొరేట్ నిర్ణయాల్లో పక్కాగా పాటిస్తున్నారు. మూఢనమ్మకాల పిచ్చకు పీక్స్ అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం చైనాలో కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమ కంపెనీలో ఉద్యోగుల్ని నియమించుకునే క్రమంలో తాము కోరుకున్న జాతకం ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే వైనం షాకిచ్చేలా ఉంది. అక్కడి మీడియా సంస్థ ఒకటి (సౌత్ చైనా మార్నింగ్ పోస్టు) తాజాగా పబ్లిష్ చేసిన ఒక కథనం సంచలనంగా మారింది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని శాంక్సింగ్ రవాణా సంస్థ తాజాగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటోంది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చైనా కరెన్సీ ప్రకారం 3వేల నుంచి 3వేల యువాన్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే సుమారు రూ.35వేలు మొదలుకొని రూ.45 వేల మధ్యలో) నెలసరి జీతాన్ని ఆఫర్ చేశారు. ఈ క్లరికల్ ఉద్యోగానికి అప్లై చేసే వారు ఎవరైనా డాగ్ రాశి చక్రంలో జన్మించి ఉంటే మాత్రం.. జాబ్ కోసం ప్రయత్నించొద్దని పేర్కొంది.
దీనికి కారణం ఏమిటో తెలుసా? డ్రాగన్ రాశి చక్రంలో పుట్టిన సదరు సంస్థ అధిపతికి డాగ్ రాశిలో జన్మించిన వారి కారణంగా నష్టపోయే అవకాశం ఉందన్న నమ్మకం ఉంది. చైనీస్ జ్యోతిష్య శాస్త్రంలో డ్రాగన్.. డాగ్ రాశి చక్రాల మధ్య పన్నెండేళ్ల వైరుధ్యం ఉందని.. వీరి కారణంగా తాను నష్టపోయే ప్రమాదం ఉందన్న నమ్మకంతో సదరు కంపెనీ యజమాని మూఢత్వం ఇప్పుడు షాకింగ్ గా మారింది. చైనాలో పెరిగిన మూఢనమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నాయన్నది ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.