గ్రహబలం వైపు చూపు.. కొవిడ్ తర్వాత యూత్ లో కొత్త మార్పు
అంతకంతకూ ఎక్కువ అవుతున్న అనిశ్చితికి విరుగుడుగా పలువురు జ్యోతిష్యాన్ని నమ్ముకోవటం ఈ మధ్యన ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
కారణం ఏమైతే కానీ.. భవిష్యత్తు గురించి.. రానున్న రోజుల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి అంతో ఇంతో అవగాహన ఉంటే.. అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నట్లుగా మారింది ఇప్పటి యూత్ తీరు. దీనికి తోడు కొవిడ్ వేళలో ఎదురైన సవాళ్లు కొత్త ఆలోచనల వైపు పయనించేలా చేశాయంటున్నారు. అంతకంతకూ ఎక్కువ అవుతున్న అనిశ్చితికి విరుగుడుగా పలువురు జ్యోతిష్యాన్ని నమ్ముకోవటం ఈ మధ్యన ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
ఈ వాదనకు తగ్గట్లే.. ఆన్ లైన్ ఆస్ట్రాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు.. పలు ఆస్ట్రాలజీ యాప్ లకు ఆదరణ అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయాన్ని చెబుతున్నారు. ఉద్యోగం ఉంటుందా? లేదా? కోరుకున్న ప్రేమ దక్కుతుందా? లేదా? ఆర్థిక సమస్యల భారం పొంచి ఉందా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సొంతింటి కల తీరుతుందా? వాహన యోగం ఉందా? ఏ నెలలో ఏ ప్రమాదం పొంచి ఉందా? వరాలెన్ని? శాపాలెన్ని? గ్రహ బలం ఎంత? బలహీనం ఎంత? ఏం చేస్తే.. పరిస్థితుల్ని మార్చుకోవచ్చు. పట్టు సాధించొచ్చు? లాంటి ప్రశ్నలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఆన్ లైన్ ఆస్ట్రాలజీ పోర్టల్స్ ను ఆశ్రయిస్తున్న యూత్ అంతకంతకూ పెరుగుతున్నారు. తాజాగా తమను రీచ్ అవుతున్న వారిలో ఎక్కువ మంది యూత్ అన్న విషయాన్నిఆన్ లైన్ జ్యోతిష్య పోర్టళ్లు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ ముందు మధ్య వయస్కుల చూపు జోతిష్యం మీద ఉంటే.. ఇప్పుడు పాతికేళ్ల వయసున్నోళ్లలో ఎక్కువ మంది ఈ శాస్త్రం మీద ఆసక్తిని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.
కొవిడ్ కు ముందు పరిస్థితితో పోలిస్తే.. ఆ తర్వాత అస్ట్రాలజీ యూప్స్.. పోర్టళ్ల వినియోగం 10 రెట్లు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఆన్ లైన్ పోర్టళ్లలో జ్యోతిష్య ఛార్జీలు ఒక రేంజ్ లో ఉన్నాయంటున్నారు. నిమిషానికి రూ.10 మాత్రమే ఛార్జ్ చేసే కనిష్ఠ స్థాయి నుంచి నిమిషానికి రూ.200 వరకు వసూలు చేసే ప్రీమియం పోర్టళ్లు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. ఆన్ లైన్ ఆస్ట్రాలజీ యూజర్లలో 60 శాతం వాటా జనరేషన్ జెడ్ యువతేనని చెబుతున్నారు. అస్ట్రో యూజర్లలో అత్యధికంగా ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. లక్నో.. జైపూర్.. చండీగఢ్.. లూధియానా లాంటి నగరాలు ఉన్నట్లు చెబుతున్నారు.
జ్యోతిష్యంతో వ్యాపార కార్యకలాపాలు చేసే అస్ట్రో పోర్టల్స్ ఆదాయం రోజు రోజుకు పెరుగుతోంది. 2021లో ఆస్ట్రోటాక్ ఆదాయం రూ.65 కోట్లు అయితే.. 2023ఆర్థిక సంవత్సరానికి దీని ఆదాయం రూ.282 కోట్లకు పెరిగినట్లుగా చెబుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్లకు చేరుతుందని.. లాభాలు రూ.130 కోట్ల వరకు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాల్ని చూస్తే..నోట మాట రాదంతే. జ్యోతిష్యాన్ని నమ్ముతున్నోళ్లు ఇంత భారీగా ఉన్నారా? అన్న భావన కలుగక మానదు.