భోళాశంకర్.. నిండా మునిగిపోయారు
టాలీవుడ్ మెగస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు గత వారం ఒక రోజు వ్యవధిలో రిలీజైన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ మెగస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు గత వారం ఒక రోజు వ్యవధిలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఔట్‌డేటెడ్ హీరోలు ఇప్పటికీ తన సినిమాలతో జోరు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా రజనీకాంత్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. చిరంజీవి మాత్రం బోల్తా కొట్టారు.
మెహెర్ రమేశ్ లాంటి ఓ ఫెయిల్యూర్ బ్రాండ్ ఉన్న డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి.. చిరు చేతులు కాల్చుకున్నారు. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట రావాల్సిన సినిమాతో వచ్చి అటు ఫ్యాన్స్‌ను ఇటు ప్రేక్షకులకు నిరాశపరిచారు. సినిమా వసూళ్లు అత్యంత దారుణంగా నమోదవుతున్నాయి. అభిమానులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి హిట్స్ తర్వాత హ్యాట్రిక్ అందుకుంటారనుకుంటే ఈ భోళా శంకర్ మొత్తానికే మోసం చేసింది. చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఆచార్య డిజాస్టర్ గాయాన్ని గాడ్ ఫాదర్, వాల్తేరు మానిస్తే.. మళ్లీ ఇప్పుడు భోళా శంకర్ అంతకన్నా మళ్లీ పెద్ద గాయం చేసి వెళ్లి పోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని థియేటర్లలోంచి తీసేస్తున్నారు.
ఈ చిత్ర ఆరు రోజుల కలెక్షన్ల షేర్ చూస్తే కనీసం రూ.30 కోట్లు కూడా అందుకోలేదు. ఆరో రోజు ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 30 లక్షల షేర్ మాత్రమే వచ్చిందట. వరల్డ్ వైడ్‌గా రూ. 40 లక్షల వరకు వచ్చిందని తెలిసింది. మొత్తంగా ఇప్పటి వరకూ కేవలం రూ. 27.30 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసుకుంది. అంటే.. ఈ సినిమాకు ఇంకా రూ. 53 కోట్ల వరకు రావాల్సి ఉంది.
మొత్తంగా చెప్పాలంటే.. ఇప్పటికే ఏజెంట్ చిత్రంతో భారీగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు ఈ భోళా శంకర్ మరోసారి గట్టి దెబ్బేసింది. అప్పుడెప్పుడో తమిళంలో వచ్చిన వేదాళం చిత్రాన్ని.. దర్శకుడు మెహెర్ రమేశ్ చేతిలో పెట్టి అటు మెగాస్టార్ చిరంజీవితో పాటు అటు నిర్మాత నిండా మునిగారు.