సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టే మార్గం దొరికింది... చెక్ వన్స్!
ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది దాదాపు చాలా మందికి తెలిసిన విషయమే.
ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది దాదాపు చాలా మందికి తెలిసిన విషయమే. ఈ సైబర్ నేరగాళ్ల అరాచకాలకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కథనాలు షాకింగ్ గా ఉంటుంటాయి. ఈ క్రమంలో ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టే మర్గం దొరికిందని అంటున్నారు.
అవును... పల్లెలు, పట్టణాలు అనే తారతమ్యాలు ఏమీ లేకుండా.. పండితులు, పామరులు అనే భేదాలేమీ లేకుండా.. ఉద్యోగులు, గృహిణులు అనే తేడాలేమీ లేకుండా సైబర్ నేరగాళ్ల బాధితులుగా చాలా మంది మిగులుతున్నారు! ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీలు చెప్పకూడదని, అత్యాశకుపోయి మోసపోకూడదని పోలీసులు నిత్యం అలర్ట్ చేస్తూనే ఉంటారు.
ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు సైబర్ పోలీసులతో పాటు బ్యాంకులు, సెల్ ఫోన్ ప్రొవైడర్లు రంగంలోకి దిగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సరికొత్త ప్రోగ్రాంలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.
ఇటీవల కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల అనుమానాస్పద కాల్స్ గుర్తించినట్లు ఎయిర్ టెల్ అనే సంస్థ ప్రకటించింది. మరోపక్క ఈ ఏడాది మొదటి 9 నెలల్లో ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు సుమారు రూ.1,500 కోట్లు దోచుకున్నారు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో అర్ధమవుతోంది.
సైబర్ నేరం జరిగేది ఇలా...!:
తొలుత సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. మాయమాటలతో ముగ్గులోకి దింపుతారు. నిండా మునిగిన తర్వాత బాధితులు తమకు ఫలానా ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందని ఫిర్యాదు చేస్తారు. తీరా పోలీసులు రంగంలోకిదిగి దర్యాప్తు మొదలుపెడితే ఆ సెల్ ఫోన్ నంబర్ తప్పుడు చిరునామాతో తీసుకున్నట్లు గుర్తించి దాన్ని రద్దు చేస్తారు. ఆ నెంబర్ ను పోలీసులు రద్దు చేసే లోపు సైబర్ నేరగాళ్లు ఆ నంబర్ తో చేయాల్సిన మోసాలు చేసేస్తుంటారు!
ఏఐతో సరికొత్త సాఫ్ట్ వేర్!:
ఈ నేపథ్యంలో... ఇలాంటి కాల్స్, అలాంటి నెంబర్స్ నుంచి వచ్చే మెసేజ్ లను నివారించడానికి సెల్ ఫోన్ ప్రొవైడర్లు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సరికొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 ప్రామాణికాంశాలను ఆధారంగా చేసుకుని కేవలం 10 రోజుల వ్యవధిలో సుమారు 12 కోట్లకు పైగా స్పాం కాల్స్ ను, 23 లక్షల మెసేజ్ లను గుర్తించినట్లు ఎయిర్ టెల్ ప్రకటించుకుంది!
రంగంలోకి బ్యాంకులు!:
సైబర్ నేరగాళ్లు ఎవరి వద్ద ఎక్కడ డబ్బు దోచుకున్నా.. దాన్ని బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఈ మేరకు వారు వందల ఖాతాలు మెయింటైన్ చేస్తుంటారని చెబుతుంటారు. అయితే వారంతా తప్పుడు వివరాలతో ఖాతాలు తెరిపించడం చేస్తుంటారు. అందుకే అలాంటి ఖాతాలను గుర్తించేందుకు బ్యాంకులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సరికొత్త సాఫ్ట్ వేర్ లను రూపొందిస్తున్నాయి!
ఈ నేపథ్యంలో హెచ్.డీ.ఎఫ్.సీ. బ్యాంక్ ఇప్పటికే సుమారు 3 లక్షల ఖాతాలను గుర్తించి వాటిని రద్దు చేసిందని చెబుతున్నరు. ఒకవేళ నిజమైన కస్టమర్ ఎవరైనా తన అకౌంట్ రద్దు అయినట్లు ఫిర్యాదు చేస్తే.. అందించిన వివరాలను పరిశీలించి తిరిగి యాక్టివేట్ చేస్తారు.
ఇలా సెల్ ఫోన్ ప్రొవైడర్లు, బ్యాంకులు కలిసి ఏఐ సాయంతో రంగంలోకి దిగి రానున్న రోజుల్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు!