కళ్లు తెరిచిన కేంద్రం.. ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయం

సైబర్ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ.. వేలాది కోట్లు దోచేస్తున్నా.. ప్రభుత్వాలు చేష్టలుడిగినట్లుగా ఉండిపోతున్న దుస్థితి.

Update: 2023-08-18 04:12 GMT

ఎన్నాళ్లకెన్నాళ్లకు? అన్నట్లుగా కేంద్రం కళ్లు తెరిచింది. ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతూ.. వేలాది కోట్లు దోచేస్తున్నా.. ప్రభుత్వాలు చేష్టలుడిగినట్లుగా ఉండిపోతున్న దుస్థితి. ఈ దారుణాలకు చెక్ పెట్టేందుకు అవసరమైన మార్గాల్ని అన్వేషించే విషయంలో చాలా ఆలస్యంగా మేలుకొన్నదని చెప్పాలి. గడిచిన రెండు.. మూడేళ్లలోనే సైబర్ నేరాల తీవ్రతను అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. అయినప్పటికీ.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యల మీద ఇప్పటికి సరైన చర్యలు చేపట్టింది లేదు. అంతకంతకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల నేపథ్యంలో తాజాగా కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

డిజిటల్ మోసాలకు మొదటి మెట్టు సిమ్ కార్డుల్ని అడ్డగోలుగా వినియోగించటం. సైబర్ నేరస్తులకు వందలాది సిమ్ కార్డులు ఇట్టే అందుబాటులోకి వచ్చేందుకు ఉన్న వీలును కేంద్రం కట్టడి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సిమ్ కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి పెద్ద ఎత్తున సిమ్ కార్డుల్ని జారీ చేసే పద్దతిని తొలగించింది. బల్క్ కనెక్షన్లు ఇచ్చినా.. వాటి వివరాల్లో ఆయా సంస్థల కేవైసీతో పాటు వ్యక్తిగత కేవైసీను (నో యువర్ కస్టమర్- మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) తప్పనిసరిగా మార్చింది.

సైబర్ నేరాలకు మూలం సిమ్ కార్డులే కావటంతో.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.సిమ్ డీలర్లు ఎవరైనా రూల్స్ ను అతిక్రమిస్తే వారికి రూ.10 లక్షలు ఫైన్ విధిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే నుంచి సరైన వివరాలు లేని సిమ్ కార్డులకు సంబంధించిన మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసినట్లుగా చెప్పారు. ఆయన చెప్పిన సంఖ్య చూస్తే షాకింగ్ గా మారింది.

కేవలం మూడున్నర నెలల వ్యవధిలో 52 లక్ష్ల మొబైల్ కనెక్షన్లను రద్దు చేయటంతో పాటు.. 67వేల మంది సిమ్ కార్డు డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లుగా పేర్కొన్నారు. 300 మందిపై ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారని.. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 66వేల వాట్సాప్ ఖాతాల్ని బ్లాక్ చేసినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నట్లుగా చెప్పిన కేంద్రం మంత్రి.. వారంతా ఇకపై పోలీసు ధ్రువీకరణ పొందేలా గడువు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ లోపు వారి వివరాల్ని పోలీసులకు అందించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తే.. అంత త్వరగా సైబర్ నేరాల నియంత్రణకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News