అక్కడ భారతీయ విద్యార్థులకు డేంజర్ బెల్స్!
కెనడా ఆహ్వానాన్ని అప్పట్లో అందరిలాగే భారతీయులు అందిపుచ్చుకున్నారు. భారీగా కెనడాకు వెళ్లారు.
భారతీయులు గత కొన్నేళ్లుగా కెనడాకు ఎక్కువగా వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు వెళ్లాలనుకునేవారికి త్వరగా వీసాలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా కెనడాను ఎంచుకుంటున్నారు. అమెరికా, కెనడా రెండూ సరిహద్దు దేశాలు. అంతేకాకుండా ప్రపంచంలోనే వైశాల్యంపరంగా రెండో పెద్ద దేశం కెనడా. అక్కడ వివిధ రంగాల్లో మానవ వనరుల కొరత విపరీతంగా ఉంది. కావాల్సినంత భూమి ఉన్నా అందుకు తగ్గ జనాభా లేరు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో వలసలను ఆ దేశం ఆహ్వానించింది.
కెనడా ఆహ్వానాన్ని అప్పట్లో అందరిలాగే భారతీయులు అందిపుచ్చుకున్నారు. భారీగా కెనడాకు వెళ్లారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రపంచంలోనే టాప్ 200 విశ్వవిద్యాలయాల్లో కొన్ని కెనడాలో కూడా ఉన్నాయి. ఇంగ్లిష్ స్పీకింగ్ కంట్రీ కావడం, అమెరికా పక్కనే ఉండటం వంటి కారణాలతో ఇతర దేశాలతో పోలిస్తే కెనడాకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. అందులోనూ అమెరికా వీసా దక్కనివారు ముందు కెనడాకు వెళ్తే అక్కడి నుంచి అమెరికా వెళ్లడం సులువుతుందని కెనడాను ఎంచుకుంటున్నారు.
అయితే ఈ వలసలు ఇటీవల కాలంలో ఎక్కువ కావడం, కొన్ని చోట్ల కెనడియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో విదేశీయులు ఉండటం వంటివి తలెత్తాయి. ముఖ్యంగా వలసలు ఎక్కువ కావడంతో గృహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇళ్ల ఖర్చు భారీగా పెరిగిపోయింది. దీంతో స్థానిక కెనడియన్లు భగ్గుమన్నారు. వలసల వల్ల కెనడియన్లు వెనుకబడిపోతున్నారని, ఉద్యోగాల్లోనూ వలస వచ్చినవారికే ప్రాధాన్యత లభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇళ్ల కోసం గతంతో పోలిస్తే భారీగా వెచ్చించాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కెనడా వలసలపై ఆంక్షలు విధించింది. విదేశీ విద్య కోసం విద్యార్థులకు వీసా ఫీజులను పెంచింది. అంతేకాకుండా వారి బ్యాంకు ఖాతాల్లో కనీసం ఉండాల్సిన ఆర్థిక నిల్వలను కూడా భారీగా పెంచింది. అలాగే వలసలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకొచ్చింది.
దీంతో కెనడాలో ఉంటున్న వివిధ దేశాల ప్రజలకు, విద్యార్థులకు కొత్త కష్టం వచ్చిపడింది. ముఖ్యంగా కెనడాలో ఉంటున్న విదేశీయుల్లో అత్యధికం భారతీయులే. అలాగే అక్కడ విద్యనభ్యసిస్తున్నవారిలో భారత విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశాన్ని వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. శాశ్వత పౌరసత్వం లభించనివారు, విద్య, ఉద్యోగాల కోసం వచ్చి తమ వీసా గడువు ముగిసినవారు కెనడాను విడిచిపెట్టాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు నిరసనకు దిగారు. కెనడా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ తమ అవకాశాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. భారతీయ విద్యార్థులు వర్క్ పర్మిట్ పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా శాశ్వత నివాసం పొందడానికి మరింత కష్టపడాల్సి వస్తోంది.
కెనడా భారీగా వచ్చిన వలసలతో ప్రస్తుతం అధిక జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వలసల వల్లే ఈ పరిస్థితి సంభవించిందని ఆ దేశ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వలసలు ఆరోగ్య రంగం, గృహనిర్మాణం వంటి ప్రభుత్వ రంగాలను దెబ్బతీసింది. దీంతో ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే.. చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం సంపాదించడానికి, చదువుకోవడానికి రుణాలు తీసుకుంటారు. అందువల్ల, వారు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాల్సి వస్తే వారి నెత్తిన భారీగా అప్పుల భారం పడుతుంది.
అందుకే ఇప్పటికే కెనడాలో చదువుతున్న వారికి కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని భారతీయ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శాశ్వత పౌరసత్వం పొందడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని, ఇతర ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.