చదువుల కోసం మన పిల్లలు 108 దేశాల్లో ఉన్నారట

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే మన పిల్లల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-08-02 08:30 GMT

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే మన పిల్లల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఏడాదికి పెరిగే సంఖ్య ఒక్కటే కాదు.. ఉన్నత విద్య కోసం వెళుతున్న దేశాల సంఖ్య గురించి తెలిస్తే సర్ ప్రైజ్ కావాల్సిందే. సాధారణంగా ఉన్నత విద్య అన్నంతనే అమెరికా.. యూకే.. అస్ట్రేలియా.. న్యూజలాండ్.. కెనడా.. సింగపూర్.. చైనా.. జర్మనీతోపాటు మరికొన్ని యూరోపియన్ దేశాలతో పాటు.. ఆసియాలోని పలు దేశాలకు వెళతారని భావిస్తాం. కానీ.. కేంద్రం తాజాగా వెల్లడించిన నివేదికను చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. కారణం.. మన పిల్లలు ప్రపంచంలోని 108 దేశాలకు ఉన్నత విద్య కోసం వెళుతున్నట్లుగా తేలింది.

తాజాగా ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందా? అని రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ అందరూ ఆశ్చర్యపోయేలా వివరాల్ని లికిత పూర్వకంగా వెల్లడించారు. 2024 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత విద్యార్థులు ప్రపంచంలోని 108 దేశాల్లో 13 లక్షల మంది (కచ్చితంగా చెప్పాలంటే 13,35,878 మంది చదువుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడున్న భారత రాయబార కార్యాలయంలో లేదంటే గ్లోబల్ రిష్తా పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని పేర్కొన్నారు. తొలిసారి విదేశాల్లో అడుగు పెట్టే విద్యార్థుల కోసం స్వాగత కార్యక్రమాలను నిర్వహించి.. ఆయా దేశాల్లో ఎదురయ్యే భద్రతాపరమైన సమస్యల గురించి సమాచారం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. 2019 నాటికి 9.07 లక్షల మంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లగా.. 2023 నాటికి ఈ సంఖ్య 13,18,955కు పెరిగినట్లుగా చెప్పారు.

ఈ ఏడాది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో అత్యధికంగా కెనడాలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఒక్క కెనడాలోనే 4,27,000 మంది ఉన్నారని.. అమెరికాలో 3,37,000 మంది, చైనాలో 8,580 మంది ఉక్రెయిన్ లో 2510 మంది ఇజ్రాయెల్ లో 900 మంది ఉన్నారని.. పాకిస్థాన్ లో 14 మంది.. గ్రీసులో 8 మంది చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో మన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించటం ఆసక్తికరంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News