హేమ కమిటీ నివేదికపై సినిమాకు జాతీయ అవార్డ్!
అవును.. హేమ కమిటీ నివేదికపై సినిమా తీసేశారు. మాలీవుడ్ వేధింపులను ఇది బట్టబయలు చేసింది.
అవును.. హేమ కమిటీ నివేదికపై సినిమా తీసేశారు. మాలీవుడ్ వేధింపులను ఇది బట్టబయలు చేసింది. నిజానికి ఈ సినిమా తీసింది మలయాళీలే కావడం యాధృచ్ఛికం. పని ప్లేస్ లో వేధింపుల గురించి తీసిన `ఆట్టం` మలయాళంలో పెద్ద హిట్టయింది. క్రిటికల్ గా ప్రశంసలు కురిసాయి. అంతేకాదు జాతీయ ఉత్తమ చిత్రంగా `ఆట్టం` పురస్కారాన్ని గెలుచుకుంది.
`ఆట్టం` అనే టైటిలే ఆసక్తిని కలిగించింది. ఆట్టం అంటే అర్థం నాటకం. ఒక మహిళకు లైంగిక వేధింపులు ఎదురైతే చుట్టూ ఉన్న మగ ప్రపంచం ఎలా స్పందించారన్నదే ఆట్టం కథలో థీమ్. ఒక రంగస్థల నాటకాలాడే గ్రూప్ లో ఒకే ఒక్క మహిళ ఉంటుంది. తనతో అందులో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ ఒకరు ఎవరు? అన్నది తనకు కూడా తెలీదు. ఆ నటి ఒకరిని అనుమానించినా అతడేననేది కచ్ఛితంగా తెలీదు. ఆ క్రమంలోనే ఇతర సభ్యులు ఆమెతో ఎలా ప్రవర్తించారు? అన్నదే సినిమా కథాంశం. మగాళ్లంతా అంతే.. తప్పుగా ప్రవర్తించినది ఎవరో తెలుసుకోవాలని లేదని ఆమె అంటుంది. దాంతో సినిమా ముగుస్తుంది.
సమస్యను క్షుణ్ణంగా అధ్యయం చేసి దానిని వినోదాత్మకంగా తెరపైకి తేవడంలో మలయాళీ దర్శకులకు గొప్ప ఐడెంటిటీ ఉంది. ఆట్టమ్ సినిమాని కూడా అదే తీరుగా అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఇది జాతీయ ఉత్తమ సినిమాగా అవార్డును అందుకుంది. అయితే జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక వెలువడే క్రమంలోనే ఈ సినిమా విడుదలవ్వడం ఆసక్తిని కలిగించింది. యాధృచ్ఛికంగా మలయాళ చిత్రసీమలోని లైంగిక వేధింపుల గురించి హేమ కమిటీ వెల్లడించిన చాలా విషయాలను తెరపైనా చూపించేసారు. హేమ కమిటీ ప్రకంపనాలు ఇతర పరిశ్రమల్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలీవుడ్ లోను హేమ కమిటీ తరహా నివేదికను రూపొందించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. తెలుగు, తమిళ చిత్రసీమల్లోను నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై ఓపెనయ్యేందుకు సహకరించే పరిస్థితి రావాలని ప్రముఖ నటీమణులు కోరుకోవడం సంచలనంగా మారింది.
ప్రముఖ మలయాళ కథానాయికపై పాపులర్ కథానాయకుడి కుట్రలో భాగంగా, అతడి అనుచరగణం వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం కాగా, దీనిపై నివేదికను రూపొందించేందుకు అప్పటి కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని నియమించింది. ఈ కమిటీ సుదీర్ఘంగా పరిశ్రమను పరిశోధించి మాలీవుడ్ లో లైంగిక వేధింపులు, మహిళల అసౌకర్యాలపై భారీ నివేదికను రూపొందించిన సంగతి తెలిసిందే.