ఆ రీమెక్ రిస్కేమో రాజా..?
అయితే రవితేజ ఈ మూవీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారంట. ఈ రీమేక్ ని ఏ హీరోతో రీమేక్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది.
ప్రస్తుతం డిజిటల్ ఎరా నడుస్తోంది. అన్ని భాషలలో కంటెంట్ డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. కంటెంట్ బాగుందనే టాక్ బయటకొస్తే భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేస్తున్నారు. కొన్ని సినిమాలని అయితే ఓటీటీ ఛానల్స్ నేరుగా ఆయా భాషల డబ్బింగ్ వెర్షన్స్ జత చేసి రిలీజ్ చేస్తున్నాయి. వీటికి ప్రేక్షకాదరణ కూడా బాగుంటుంది. ఇలాంటి టైంలో ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలు రీమేక్ చేయడం అంటే వర్క్ అవుట్ అయ్యే ప్లాన్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పుడు సినిమాలకి లాంగ్వేజ్ బారియర్స్ ఉండేవి. ప్రేక్షకులు కూడా కేవలం థియేటర్స్ లోనే సినిమాలు చూసేవారు. వేరొక భాషలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి అవగాహన తక్కువగా ఉండేది. అందుకే ఇతర భాషలలో హిట్ అయిన మూవీస్ ని తెలుగులో విపరీతంగా రీమేక్ చేసేవారు. అలా రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే తెలుగు సినిమాలని కూడా ఇతర భాషలలో రీమేక్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు.
ప్రస్తుతం ఇతర భాషలలో మేకర్స్ కొత్త కథల కోసం చూస్తున్నారు. రీమేక్ ఆలోచనలు పూర్తిగా పక్కన పెట్టేసారు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటికి కొంతమంది ఓటీటీలో రిలీజ్ అయ్యి, అందరూ చూసేసిన కథలని రీమేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పన్ కోషియమ్', 'లూసీఫర్' తెలుగులో రీమేక్ చేసి ఫెయిల్ అయ్యారు. హిందీ 'పింక్' సినిమాని 'వకీల్ సాబ్' గా రీమేక్ చేశారు.
ఎన్ని మార్పులు చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అలాగే 'వేదాళం' చిత్రాన్ని 'భోళా శంకర్' గా చిరంజీవి రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మలయాళంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన 'ఆవేశం' సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఓటీటీలో చాలా మంది చూసేసారు. ముందుగా బాలయ్యతో ఈ మూవీ రీమేక్ చేయాలని కొంతమంది ప్లాన్ చేసి మరల విరమించుకున్నారు.
అయితే రవితేజ ఈ మూవీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసారంట. ఈ రీమేక్ ని ఏ హీరోతో రీమేక్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. నిజానికి ఆ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ ఫాహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్ కి ఇవ్వాలి. ఆ స్థాయిలో యాక్టింగ్ చేసే వాళ్ళు తెలుగులో ఉన్నారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రవితేజనే హీరోగా ఈ సినిమా రీమేక్ చేయాలంటే ఆయన బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ కి తగ్గట్లు చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందనేది చెప్పలేం. మరి 'ఆవేశం' రీమేక్ ఆలోచన ఈ టైంలో వర్క్ అవుట్ అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.