ఓటీటీల్లో అశ్లీల కంటెంట్‌ని బ్లర్ చేయొచ్చా?
సినిమాలకు సెన్సార్ షిప్ అనేది ఉంటుంది. అడల్ట్ కంటెంట్ తీవ్రతను బట్టి ఏ, యుఏ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. కానీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లకు అలాంటి సెన్సార్ కట్ నియమం ఇన్నాళ్లు లేదు.
సినిమాలకు సెన్సార్ షిప్ అనేది ఉంటుంది. అడల్ట్ కంటెంట్ తీవ్రతను బట్టి ఏ, యుఏ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. కానీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లకు అలాంటి సెన్సార్ కట్ నియమం ఇన్నాళ్లు లేదు. కానీ సమాచార ప్రసారాల శాఖ ఓటీటీ కంటెంట్ సృష్టికర్తలపై కొరడా ఝలిపించేందుకు అన్ని నియమ నిబంధనలను ప్రవేశ పెడుతుండడంతో ఇప్పుడు అందరూ మేల్కొంటున్నారు.
ఇలాంటి సమయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయం పెద్దగా ఉపయోగపడనుంది. నిజానికి ఏఐ రాకతో విజువల్ పరిశ్రమలో పెను విధ్వంశం జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ అదే సమయంలో ఏఐ తో కొన్ని పరిష్కారాలు లభించనున్నాయని ప్రూవ్ కాబోతోంది. ముఖ్యంగా ఓటీటీలో అసభ్యతతో కూడుకున్న కంటెంట్ ని బ్లర్ చేసేందుకు, ఆటోమేటిక్‌గా క్రాప్ చేసేందుకు ఆప్షన్ ఉందని చెబుతున్నారు. సబ్‌టైటిల్స్ లేదా ఆడియో విభాగానికి సమీపంలో ఉన్న ఒక చిన్న ఐకాన్‌ను ఉపయోగించి లైంగిక లేదా హింసాత్మక, రక్తపాత దృశ్యాలను కత్తిరించే ఎంపికను ఏఐతో పొందవచ్చని చెబుతున్నారు.
నిజానికి ఏఐలో ఈ ఆప్షన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది. ఓటీటీలు తమ కంటెంట్ ని రివైజ్ చేసేప్పుడు ఏఐ సహకారంతో అవసరమైన చోట బ్లర్ చేసుకోవడానికి లేదా ఆటో క్రాప్ చేసుకునేందుకు సాంకేతికత అందుబాటులో ఉంది. ముఖ్యంగా నగ్న, శృంగార సన్నివేశాలు, అలాగే రక్తపాతంతో కూడుకున్న, విలువలు దిగజారిన సన్నివేశాలు కనిపించినప్పుడు వాటిని బ్లర్ చేసుకునేందుకు ఆప్షన్ ని వినియోగించుకునే వీలుంది.
పిల్లలతో కలిసి పేరెంట్, ఇతర కుటుంబ సభ్యులు లంచ్ లేదా డిన్నర్ టైమ్ లో ఓటీటీలను వీక్షించేవారికి ఘాటైన శృంగార సన్నివేశాలు, లైంగిక విశృంఖలత, రక్తపాత సన్నివేశాలు చూడటానికి ఇబ్బంది పడతారు. ఆ రకంగా ఓటీటీలు ఫ్యామిలీ ఆడియెన్ ని కోల్పోతున్నాయి. కేవలం యూత్ మొబైల్స్ లో ఇలాంటి కంటెంట్ ని వీక్షించడానికి అలవాటు పడ్డారు. కానీ ఫ్యామిలీ ఆడియెన్ కి ఏఐ సాంకేతికత చాలా సాయం చేయబోతోంది. ఓటీటీలు అందుబాటులో ఉన్న ఏఐ అనుబంధ సాంకేతికతను ఉపయోగించుకుని మెరుగవుతాయేమో చూడాలి. అలాగే సాంకేతికతతో పని లేకుండా అసభ్యత, అశ్లీలతను చూడాలా వద్దా? అన్నది అంతిమంగా ఎండ్ యూజర్ దే ఆప్షన్ అన్నది ప్రజలు గ్రహించాలి.