ప్రెస్ మీట్ పెట్టి తనను తాను బుక్ చేసుకున్న బన్నీ?
తప్పు చేశానా? లేదా? అన్నది పక్కన పెడితే.. మాటలు అప్పుడప్పుడు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. నిజాయితీపరులు.. నిజాలు మాట్లాడే వారు సైతం తమ మాటల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు
తప్పు చేశానా? లేదా? అన్నది పక్కన పెడితే.. మాటలు అప్పుడప్పుడు ఇబ్బందికి గురి చేస్తుంటాయి. నిజాయితీపరులు.. నిజాలు మాట్లాడే వారు సైతం తమ మాటల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే.. నోటి నుంచి వచ్చే మాటలకు ఉన్న పవర్ మరి దేనికి ఉండదు. అందుకే.. ముందుచూపు ఉన్నోళ్లు.. జాగ్రత్తపరులు తొందరపడి మాట్లాడటానికి ఇష్టపడరు. అదే సమయం బరితెగించినట్లుగా వ్యవహరించేటోళ్లు.. ఏం జరిగినా ఫర్లేదనుకునే వాళ్లు మాత్రం వేటిని పెద్దగా పట్టించుకోరు. మరి.. అల్లు అర్జున్ ఏ కోవకు చెందిన వారు? అన్నది ఆయనకు ఆయనే డిసైడ్ చేసుకోవాలి.
ఒక సంచలన అంశానికి సంబంధించి మాట్లాడాలని డిసైడ్ అయిన తర్వాత.. తన మాటల్లో తనను తాను చెప్పకూడని అంశాలు ఏం ఉన్నాయన్నది క్రాస్ చెక్ చేసుకోకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. ఆ చిన్న పాయింట్ ను అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయినట్లు? మితిమీరిన ఆత్మవిశ్వాసమా? లేదంటే తాను చేసిన తప్పుల్ని తాను సైతం గుర్తించలేని స్థితిలో ఉండటమా? సాధారణంగా ఒక స్థాయికి వెళ్లిన తర్వాత తాము చేసిన తప్పుల్ని తాము గుర్తించే తత్త్వం చాలా మందిలో మిస్ అవుతుంది.
అయితే.. తెలివైన కొందరు మాత్రం.. నమ్మకస్తుల్ని తమ వెంట పెట్టుకొని.. తాను చూడని యాంగిల్ లో విషయాల్ని గుర్తిస్తూ.. తనను అలెర్టు చేసేలా కొందరిని ఉంచుకుంటారు. ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. వారి ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకుంటారు. మరి..అలాంటి వ్యవస్థ అల్లు అర్జున్ కు లేరా? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ ఉన్నా.. వారు సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదా? అల్లు అర్జున్ మనసుకు ఇబ్బంది కలిగించే.. ఇరిటేట్ చేసే అంశాల్ని గుట్టుగా తామే డీల్ చేసి.. ఇష్యూను క్లోజ్ చేద్దామని అనుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు బోలెడన్ని ఇప్పుడు చర్చగా మారుతున్నాయి.
ఇప్పుడే ఈ చర్చ అంతా అంటే.. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావటం.. అల్లు అర్జున్ మీదా.. సినీ రంగ పరిశ్రమ మీదా నిప్పులు చెరగటం.. వారి తీరును తప్పు పట్టటం దరిమిలా.. కేవలం మూడు నాలుగు గంటల వ్యవధికే ప్రెస్ మీట్ పెట్టేసి.. ఎవరూ ఊహించని రీతిలో కౌంటర్లు ఇవ్వటం సంచలనంగా మారింది. బన్నీ తీరు చాలామందికి విస్మయానికి గురి చేసింది.
ఏ అంశాన్నిలాగకూడదో.. అదే అంశాన్ని ఎందుకంత బలంగా లాగుతున్నారన్నది అర్థం కాలేదు. అదే టైంలో కొందరు బన్నీని తెగ ఇబ్బంది పెట్టేయటంతోనే ఆయనిలా రియాక్టు అవుతున్నారంటూ వ్యాఖ్యలు చేసినోళ్లు ఉన్నారు. అయితే.. తన వద్ద పక్కా సమాచారం ఉన్న తర్వాత.. సీఎం రేవంత రంగంలోకి దిగి ఉంటారన్న కనీస విషయాన్ని అల్లుఅర్జున్ గుర్తించకపోవటం.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు అంచనా కట్టకపోవటం దేనికి నిదర్శనం? అన్నది మరో ప్రశ్న.
ప్రెస్ మీట్ పెట్టేసి.. రాజకీయ నాయకుడి మాదిరి కౌంటర్లు ఇవ్వటం.. తనకు తాను ఎలాంటి తప్పులు చేయలేదన్న విషయాన్ని పదే పదే చెప్పే క్రమంలో తానేం చేశానన్న విషయాన్ని వివరిస్తూ.. తెలియకుండానే ఉచ్చులో ఇరుక్కున్నారు. అల్లు అర్జున్ లేవనెత్తిన అంశాలకు సంబంధించిన షాకింగ్ కౌంటర్ ను తర్వాతి రోజు మధ్యాహ్నం పోలీసులు వీడియోతో సహా వెల్లడించటంతో బన్నీ అండ్ కో సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే.. ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ లేవనెత్తిన అన్ని అంశాలే కానీ.. అంతకు మించి అన్నట్లు పోలీసులు తమ వీడియోలో మొత్తం విషయాన్ని చెప్పేశారు. దీంతో.. అల్లుఅర్జున్ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.
అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్ అయితే.. అందుకు ప్రతిగా తాను వైల్డ్ ఫైర్ అయినట్లుగా ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తే.. అసలుసిసలు వైల్డ్ ఫైర్ పోలీసులదన్న విషయం వారి ప్రజంటేషన్ తర్వాత.. వీడియో విడుదల చేసిన తర్వాత కానీ బోధ పడలేదు. అదే సమయంలో తాను పెట్టిన ప్రెస్ మీట్ మిస్ ఫైర్ అయినట్లుగా అందరికి అర్థమైంది. మొత్తంగా ఏ టైంలో మాట్లాడాలి? ఏ టైంలో మౌనంగా ఉండాలి? అన్న విషయంలో అల్లు అర్జున్ తెలుసుకోవాల్సింది చాలానే ఉందన్న విషయం అర్థమవుతుంది. సీఎంకు కౌంటర్ ఇవ్వాలన్న అత్యుత్సాహంతో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టటమే కాదు.. రాబోయే రోజుల్లో మరింత మూల్యం చెల్లించే పరిస్థితిని చేజేతులారా కొని తెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.