షోలే: నాడు 3కోట్ల బడ్జెట్‌.. నేడు 400కోట్లు పెట్టాలి

నాడు- నేడు బ‌డ్జెట్ల రేంజ్, వ‌సూళ్ల రేంజును ప‌రిశీలిస్తే అనూహ్య‌మైన మార్పు ఉంది. క్లాసిక్ డేలో బ‌డ్జెట్లు త‌క్కువే.

Update: 2025-01-31 13:30 GMT

నాడు- నేడు బ‌డ్జెట్ల రేంజ్, వ‌సూళ్ల రేంజును ప‌రిశీలిస్తే అనూహ్య‌మైన మార్పు ఉంది. క్లాసిక్ డేలో బ‌డ్జెట్లు త‌క్కువే. వ‌సూళ్లు కూడా త‌క్కువే. మార్కెట్ ప‌రిధి కేవ‌లం ఏదో ఒక భాష వ‌ర‌కే ప‌రిమిత‌మైన రోజుల‌వి. కానీ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయ సినిమా ఆడుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే బ‌డ్జెట్లు పెరిగాయి. పారితోషికాలు, సాంకేతిక అవ‌స‌రాలు కూడా అమాంతం పెరిగాయి. 1975లో 3 కోట్ల‌తో నిర్మించిన క్లాసిక్ హిట్ మూవీ షోలేను ఇప్పుడు తిరిగి తెర‌కెక్కిస్తే 2025లో ఎంత ఖర్చు అవుతుంది?

15 ఆగ‌స్టు 1975న విడుదలైన షోలో తారాగ‌ణం వివ‌రాల్లోకి వెళితే... అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని వంటి దిగ్గజ తార‌లు నటించారు. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించ‌గా.. ఆ కాలంలో విప్లవాత్మ‌క విజ‌యాన్ని సాధించింది. 2025 లో అదే సినిమా తీయాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుంది? అంటే సుమారు అంచ‌నా 300-400 కోట్లు.

రూపాయి మార‌కం విలువ ఆధారంగా చూస్తే, నాడు రూ.3 కోట్లు ఇప్పుడు దాదాపు రూ. 150-200 కోట్లకు సమానం. 1975 సమయంలో ఈ సినిమా ఖరీదైన వీఎఫ్‌.ఎక్స్ లేదా అత్యాధునిక ఎడిటింగ్ టెక్నిక్‌లతో తెర‌కెక్క‌లేదు. సాంకేతికంగా బ‌డ్జెట్ కూడా త‌క్కువ‌. ఈరోజుల్లో వీఎఫ్.ఎక్స్ - కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ కోసం సుమారు రూ. 50-80 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. అలాగే డిజిటల్ సినిమాటోగ్రఫీ కోసం మ‌రో 20 కోట్లు, డ్రోన్ షాట్లు , హై టెక్ కెమెరాల కోస‌మే మ‌రో 10 కోట్లు అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అప్ప‌ట్లో షోలోని కర్ణాటకలోని రామనగరం ప్రాంతంలో చిత్రీకరించారు. అలాంటి సెట్ కావాల‌నుకుంటే ఏకంగా 20కోట్లు పైగానే ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా.

ఇటీవ‌ల మారిన ట్రెండ్ లో పారితోషికాల రేంజు చుక్క‌ల్ని తాకుతోంది. అప్ప‌ట్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమ మాలిని, సంజీవ్ కుమార్, అమ్జద్ ఖాన్ అంద‌రికీ క‌లిపి దాదాపు రూ. 25-30 లక్షలు చెల్లించారు. నేటిత‌రం స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ వంటి తారలతో ఈ సినిమాను నిర్మిస్తే వారంద‌రికీ క‌లిపి పారితోషికం దాదాపు రూ. 100-150 కోట్లు చెల్లించాల్సి వ‌స్తుంద‌ని అంచ‌నా. ఇప్ప‌టి ఖ‌ర్చుల ప్ర‌కారం.. సంగీతం కోసం 15 కోట్లు, మార్కెటింగ్ ప్ర‌చారం ఖ‌ర్చులు క‌లుపుకుని మ‌రో 30 కోట్లు అద‌నంగా అవుతుంద‌ని అంచ‌నా. దీనిని బ‌ట్టి 1975లో రూ. 3 కోట్లతో నిర్మించిన షోలేను ఇప్పుడు నిర్మించాలంటే 300 కోట్లు పైగానే ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని అంచ‌నా. అయితే అలాంటి అద్భుత‌మైన క‌థ‌, నేటి స్టార్ డ‌మ్ దృష్ట్యా చూస్తే ఇలాంటి గొప్ప సినిమా 1000 కోట్లు పైగా వసూళ్ల‌ను తేగ‌ల‌దు. ఈరోజుల్లో అలాంటి గొప్ప క‌థ‌లు క‌నిపించ‌డం లేదు.

Tags:    

Similar News