దేవీ సంస్కారం గురించి హరీష్ శంకర్ ట్వీట్!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్లు హీరో- హీరోయిన్‌ది కావొచ్చు, హీరో- డైరెక్టర్ అవొచ్చు, డైరెక్టర్- మ్యూజిక్ డైరెక్టర్ అవొచ్చు.;
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్లు హీరో- హీరోయిన్‌ది కావొచ్చు, హీరో- డైరెక్టర్ అవొచ్చు, డైరెక్టర్- మ్యూజిక్ డైరెక్టర్ అవొచ్చు. సినిమాల ఫలితాలను పక్కన పెడితే వారి కాంబోలో సినిమా వస్తుందంటే చాలు అనౌన్స్‌మెంట్‌తోనే ఆ సినిమాలకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంటుంది.
అలాంటి ఓ కాంబినేషన్ డైరెక్టర్ హరీష్ శంకర్- మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ది. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఒక్కటి చాలు వీరి కాంబో గురించి చెప్పడానికి. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా మ్యూజికల్ గా మంచి హిట్ సాధించింది.
గబ్బర్ సింగ్, డీజే తర్వాత హరీష్ శంకర్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమాకు కూడా దేవీ శ్రీ ప్రసాద్‌నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుని, అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. కానీ చివరకు ఆ సినిమా నుంచి దేవీ తప్పుకున్నాడు. ఉన్నట్టుండి గద్దలకొండ గణేష్ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని దేవీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
గద్దలకొండ గణేష్ కోసం తనను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుని హరీష్ నెరేషన్ కూడా ఇచ్చారని, ఈ సినిమా చేసేద్దాం అనుకునేలోగా సర్‌జీ.. ఇందులో వెల్లువొచ్చె గోదారమ్మ సాంగ్ ను రీమిక్స్ చేద్దామనుకుంటున్నానని చెప్పారని, కానీ తాను రీమిక్స్ పాటలు చేయకూడదనే రూల్ పెట్టుకున్నానని దేవీ తెలిపాడు.
హరీష్ తనను ఎంత కన్విన్స్ చేద్దామనుకున్నా దానికి తాను ఒప్పుకోకపోవడంతో, చివరకు హరీషే కాంప్రమైజ్ అయి రీమిక్స్ సాంగ్ ను తీసేద్దామనుకున్నారని కానీ దానికి తాను ఒప్పుకోలేదని దేవీ తెలిపాడు. గతంలో హరీష్ ను కూడా ఈ ప్రశ్న అడిగారని, దానికి రీమిక్స్ చేయడం ఆయనకు ఇష్టముండదని, అందుకే ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాడని చాలా హుందాగా చెప్పారని, ఆయన చెప్పిన విధానం ఎంతో నచ్చి వెంటనే సర్ జీ కి ఐ లవ్ యూ చెప్పానని గుర్తు చేసుకున్నాడు దేవీ.
దేవీ మాట్లాడిన ఈ విషయాన్ని హరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గుర్తింపు కోసం, క్రేజ్ కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో గుర్తుంచుకుని మరీ మీరు ఇలా మాట్లాడటం మీ గొప్పతనమని, మీ మ్యూజిక్ గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేశారని రాసుకొచ్చాడు.