కన్నప్పలో స్టార్స్ రన్ టైమ్.. అసలు క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు!
ప్రతీ నటుడికి కూడా లైఫ్ లో ఒక్కసారి మాత్రమే కొన్ని అరుదైన కథలు వస్తాయి. ఇక మంచు విష్ణు కెరీర్ లో కన్నప్ప కథ అలాంటిదే.;
ప్రతీ నటుడికి కూడా లైఫ్ లో ఒక్కసారి మాత్రమే కొన్ని అరుదైన కథలు వస్తాయి. ఇక మంచు విష్ణు కెరీర్ లో కన్నప్ప కథ అలాంటిదే. నేటితరం స్టార్స్ లో ఎంతోమంది ఈ సినిమా చేయాలని అనుకున్నప్పటికి ధైర్యం చేయలేకపోయారు. కానీ మంచు విష్ణు గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విష్ణు మంచు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ భక్తి యాక్షన్ డ్రామా కన్నప్ప గురించి ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దేశంలోని అగ్రశ్రేణి నటులు ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్‌లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఏప్రిల్ 25 విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కేవలం ఒక భక్తి కథగా కాకుండా, భారీ తారాగణంతో సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని టాక్. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మంచు ఈ సినిమాలో స్టార్ నటుల పాత్రలపై క్లారిటీ ఇచ్చాడు.
సినిమాలో స్టార్స్ కేవలం తక్కువ రన్ టైమ్ లో కనిపిస్తారని రకరకాల వార్తలు వైరల్ కాగా ఆ విషయాలపై విష్ణు ఈ విధంగా వివరణ ఇచ్చారు. వాళ్లు కేవలం గెస్ట్ అప్పియరెన్స్ లాగా ఉండరని, స్క్రీన్ టైమ్ పరంగా చూస్తే వాళ్ల సొంత సినిమాల కంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది అని ఆయన స్పష్టం చేశాడు. ముఖ్యంగా, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు కేవలం రెండు, మూడు నిమిషాలకు పరిమితం కాదని, కథలో చాలా కీలకమైన రోల్ పోషించబోతున్నారని వెల్లడించాడు.
ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్, విజువల్ ట్రీట్ గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ స్టార్ హీరోలు ఇందులో నిజమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారని విష్ణు చెప్పిన మాటలు మరింత హైప్‌ను పెంచేశాయి. మోహన్ బాబుతో పోల్చితేనూ ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పడం విశేషం. అంటే, వీరి పాత్రలు కథలో ఎంత బలంగా డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
కన్నప్ప కథ పరంగా ఒక శివభక్తుని జీవితంలో జరిగిన సంఘటనలు, ఆధ్యాత్మికత, యుద్ధ సన్నివేశాలతో కూడిన భారీ కథాంశాన్ని చూపించబోతోంది. ఈ చిత్రాన్ని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. ప్రాముఖ్యత ఉన్న పాత్రలకు భారీ స్థాయిలో స్టార్ కాస్టింగ్‌ను ఎంపిక చేయడం వల్ల సినిమా స్థాయి పెరిగింది. ఈ స్థాయి సినిమాల్లో సాధారణంగా స్టార్ నటులు చిన్న పాత్రలే పోషిస్తారు అనే అభిప్రాయం ఉంది. కానీ విష్ణు చేసిన కామెంట్స్ చూస్తుంటే, ఈసారి వారి పాత్రలకు మరింత స్కోప్ ఉండబోతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కన్నప్ప సినిమా, అన్ని భాషల్లోనూ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందించబడినట్లు చిత్రబృందం వెల్లడిస్తోంది.