చిరు సంక్రాంతి సినిమా సెకండ్ హాఫ్‌లో..!
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరూ చాలా విశ్వాసంతో వచ్చే ఏడాది సంక్రాంతి కోసం వెయిట్ చేస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను మే నెలలో విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర సినిమాను రెండు సార్లు వాయిదా వేసిన మేకర్స్ ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారనే విషయంలో క్లారిటీ లేదు. విశ్వంభర సినిమా విడుదలపై కంటే చిరంజీవి తదుపరి సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు, ఆసక్తి ఎక్కువగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరూ చాలా విశ్వాసంతో వచ్చే ఏడాది సంక్రాంతి కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇటీవల చిరంజీవి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సమ్మర్‌లోనే సినిమా ప్రారంభం అవుతుంది అంటూ ఆయన హింట్ ఇచ్చారు. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సెంటిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసం అనిల్ రావిపూడి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా సినిమాను రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ అవుతోంది.
కథ చెబుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమా కథను రెడీ చేసుకోవడం కోసం ఎప్పుడూ వైజాగ్ వెళ్లే అనిల్ రావిపూడి ప్రస్తుతం అక్కడే సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవలే సినిమా ఫస్ట్ హాఫ్ ను లాక్ చేశారని, సెకండ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఎపిసోడ్స్ పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటాయని సమాచారం అందుతోంది. అంతే కాకుండా సెకండ్ హాఫ్‌లో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెల్ ఉంటుందని, సినిమా మొత్తానికి ఆ ఒక్కటే యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. అందుకే ఆ యాక్షన్ సీన్‌ను సైతం వినోదాత్మకంగా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందించే పనిలో అనిల్ ఉన్నాడని తెలుస్తోంది. చిరంజీవి గత కొన్నాళ్లుగా మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకునే స్థాయిలో సినిమాను చేయలేదు. కనుక అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అయినా చిరంజీవి స్థాయికి, స్టామినాకి రీచ్ అయ్యే మూవీ అయ్యి ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. చిరంజీవితో ఈ ఏడాది జూన్‌లో సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత లు సంయుక్తంగా నిర్మించనున్నారు.