RRR అసలు హీరో ఎవరు? AI జవాబుతో మరో రచ్చ
ముఖ్యంగా రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.;
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమా చుట్టూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సినిమా విడుదల సమయంలోనే ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చినట్టు దర్శకుడు రాజమౌళి చెప్పినా, అభిమానులు మాత్రం ఇంకా తేల్చుకోవడానికి సిద్ధంగా లేరు. తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఫ్యాన్స్ నేరుగా ట్విట్టర్ (X) AI బాట్ గ్రోక్ ను సంప్రదించి ఎవరు అసలు కథానాయకుడు అనే ప్రశ్నను సంధించారు. ఊహించనట్టుగా, ఈ AI బాట్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇలా సమాధానం ఇచ్చింది.. "RRRలో కోమరం భీమ్ (ఎన్టీఆర్) ప్రధాన కథానాయకుడిగా కనిపిస్తాడు. మల్లిని రక్షించడానికి బయలుదేరే పాయింట్ తో కథ మొదలవుతుంది. అయితే, అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కూడా కీలక పాత్రలో కనిపిస్తాడు. ఇద్దరూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేవారే అయినప్పటికీ, భీమ్ పాత్రే కథను ముందుకు తీసుకెళుతుంది."
ఈ సమాధానం బయటకొచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో గ్రోక్ సమాధానాన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, "చూశారా? AI కూడా భీమ్‌కే ప్రధాన కథానాయకుడిగా గుర్తించింది!" అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే, రామ్ చరణ్ అభిమానులు మాత్రం దీనికి భిన్నమైన విధంగా స్పందిస్తున్నారు. "ఇద్దరు కథానాయకులే.. కానీ చరణ్ పాత్రలోని ఎమోషనల్ డెప్త్ మిగతా ఎవరికి లేదు." అంటూ వాదిస్తున్నారు.
ఈ వివాదం కొత్తది కాదు. సినిమా విడుదలైన వెంటనే ఇదే ప్రశ్న దర్శకుడు రాజమౌళికి ఎదురైంది. అప్పట్లో ఆయన "ఇద్దరూ సమానమైన పాత్రలు పోషించారు. కథలో ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూడకూడదు. ఇది ఒక ఫ్రెండ్‌షిప్ డ్రామా." అని క్లారిటీ ఇచ్చారు. అయితే, అభిమానులు మాత్రం ఆయా పాత్రల ప్రాముఖ్యత గురించి తమదైన విశ్లేషణలు చేస్తూనే ఉన్నారు.
కథ భీమ్ మల్లిని రక్షించేందుకు రావడంతో మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ లో అసలైన ఎమోషనల్ కనెక్ట్ భీమ్ పాత్ర ద్వారానే వస్తుందని ఎన్టిఆర్ తరచుగా చెబుతుంటారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్.. రాజు పాత్ర కథలో చాలా మలుపులు తీసుకువచ్చేలా ఉంటుంది. డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర.. భీమ్ కంటే బలమైన క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది.. అని చెబుతున్నారు. ఈ వాదనలు ఎప్పటికీ ఆగేలా లేవు. మరి, గ్రోక్ సమాధానం ఈ గొడవను ఇంకా ముదిరిస్తుందా లేదా అనేది చూడాలి.
సినిమా చూసిన ప్రేక్షకుల దృష్టిలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ సమాన స్థాయిలో రాణించారు అనే అభిప్రాయం ఉంది. కానీ అభిమానుల కోణంలో చూస్తే, తమ హీరోకే ప్రాధాన్యత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు AI టెక్నాలజీ కూడా దీనికి జడ్జ్ గా మారడంతో, వాదోపవాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే, చివరికి ఆర్ఆర్ఆర్ ప్రధాన విజయం హీరోలిద్దరిదే.. రాజమౌళి తీసిన గ్రాండ్ విజన్ అందరిదీ అని చెప్పడమే సరైన నిర్ణయమవుతుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో ఇంకా వెనక్కి తగ్గేలా లేరు!