హీరో విశ్వక్ సేన్ ఇంట్లో బంగారం చోరీ!
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో విశ్వక్ సేన్ నివాసముండే ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.;
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో విశ్వక్ సేన్ నివాసముండే ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వక్ ఫ్యామిలీ మొత్తం ఒకే ఇంట్లో ఉంటారు. ఆయన సోదరి వన్మయి బెడ్ రూమ్ లో మార్చి 16 వేకువఝామున ఈ దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది.
థర్డ్ ఫ్లోర్ లో ఉండే వన్మయి రూమ్ లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించిన ఆమె అనుమానంతో అల్మారాలు చూడగా, అందులో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించింది. దీంతో విషయాన్ని తండ్రికి చెప్పగా, ఆయన వెంటనే ఫిల్మ్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
కరాటే రాజు ఇచ్చిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు విశ్వక్ ఇంటికి చేరుకుని క్లూస్ టీమ్ హెల్ప్ తో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు. వేకువఝామున 5.50 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చి నేరుగా మూడో అంతస్తుకి వెళ్లి వెనుక డోర్ నుంచి వన్మయి బెడ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న బంగారాన్ని దొంగిలించినట్టు గుర్తించారు.
ఇంట్లోకి వచ్చిన 20 నిమిషాల్లోనే దొంగ తన చోరీని పూర్తి చేసుకుని వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే దొంగ రెండు డైమండ్ రింగులతో పాటూ రూ.2.20 లక్షల బంగారు ఆభరణాలు దొంగిలించినట్టు విశ్వక్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ జరుపుతున్నారు.