లెజెండరీ నటుడి వారసుడు ఓటీటీ సూపర్‌స్టార్!
బాలీవుడ్ లో కథానాయకుగా ఆరంగేట్రం చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు.;
బాలీవుడ్ లో కథానాయకుగా ఆరంగేట్రం చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు. లెజెండరీ డాడ్ సూపర్ స్టార్‌డమ్ ని, దాని తాలూకా లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు సమర్థుడేనా? అంటూ చాలామంది ప్రశ్నించారు. కానీ అభిషేక్ బచ్చన్ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. దానికి కారణం మీడియా సహా పరిశ్రమ వర్గాలు, ప్రజలు అతిగా అతడిని ఊహించుకోవడమేనని విశ్లేషించాలి.
అయితే ఆరంభం కష్ట కాలంలో ఉన్నప్పుడు పరిశ్రమను వదిలి వెళ్లిపోవాలని భావించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తెలిపారు. అయితే తన తండ్రి అమితాబ్ స్ఫూర్తివంతమైన సలహా కారణంగానే ఆగిపోయానని అన్నాడు. ``ప్రయత్నిస్తూనే ఉండు.. ఫలితం వస్తుందని.. మెరుగవుతావ``ని లెజెండరీ అమితాబ్ తనయుడికి సూచించారు. అది బాగా వర్కవుటైంది. నెమ్మదిగా పరిణతి ఉన్న నటుడిగా మారడానికి అతడికి సమయం పట్టింది. అనుభవం బాగా సహకరించింది.
ఇటీవల అతడి స్క్రిప్ట్ ఎంపికలు, పాత్రలతో మ్యాజిక్ చేస్తున్నాడు. అయితే పెద్ద తెరను మించి అతడు ఓటీటీలో క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అతడు నటించిన ఓటీటీ సిరీస్ లకు చక్కని ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ `బీ హ్యాపీ` అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ విమర్శకులు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇందులో అభిషేక్ నటనకు మంచి పేరొచ్చింది. ఇంతకుముందు షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన `ఐ వాంట్ టు టాక్` కూడా ఓటీటీలో విడుదలై ఆదరణ దక్కించుకుంది. అయితే అదే సినిమా థియేటర్లలో ఆదరణ దక్కించుకోలేదు. అంతకుముందు ఘూమర్ కూడా ఫెయిలైంది.
కానీ ఓటీటీలో వచ్చిన ఐ వాంట్ టు టాక్, బీ హ్యాపీ మంచి పేరు తెచ్చాయి. అంతకుముందు `బ్రీత్: ఇన్‌టు ది షాడోస్` ఓటీటీ సిరీస్ కూడా ఆకట్టుకుంది. లూడోలో కూడా తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు లూడోలో బాల నటుడితో కలిసి అభిషేక్ నటించిన బీహ్యాపీ మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుత ఆదరణ చూస్తుంటే అభిషేక్ ని ఓటీటీ సూపర్ స్టార్ గా అభివర్ణించాల్సి ఉంటుంది. పెద్ద తెరపై నిరాదరణకు చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీలో మాత్రం అందుకు భిన్నంగా అత్యుత్తమ కంటెంట్ తో అభిషేక్ దూసుకుపోతున్నాడు. పెద్ద తెర కోసం ఆరాటపడకుండా ఓటీటీలో ఇలానే సూపర్ స్టార్ గా కొనసాగితే మంచిదేనని విశ్లేషిస్తున్నారు.