నేను మాజీ భార్యను కాదు: రెహమాన్ భార్య సైరా
లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన రెహమాన్ అలసట, డీ హైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు.;
కష్టంలో ఉన్నప్పుడే కుటుంబం అవసరమేమిటో తెలిసొస్తుంది. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని నేటి ఉదయం వార్త అందగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కలతకు గురయ్యారు. అదే సమయంలో అతడి సోదరుడు, కుమారుడు, భార్య కూడా స్పందించారు.
లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన రెహమాన్ అలసట, డీ హైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల తర్వాత అతడికి ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరిస్తూ చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెహమాన్ గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారని ఒక సెక్షన్ మీడియా అప్పటికే వార్తల్ని ప్రచారం చేసింది. దీనిని ఖండిస్తూ, రెహమాన్ సోదరి ఏఆర్ రెహనా కూడా ఛాతీ నొప్పి కారణంగా అతను ఆసుపత్రిలో చేరాడనే పుకార్లను తోసిపుచ్చింది. ఇది ప్రయాణ అలసట వల్ల ఏర్పడిన డీహైడ్రేషన్ మాత్రమేనని ధృవీకరించారు. రెహమాన్ కుమారుడు ఏ.ఆర్ అమీన్ సోషల్ మీడియాలో తన తండ్రి బాగా కోలుకుంటున్నారని అభిమానులకు హామీ ఇచ్చాడు. వారి ప్రార్థనలు, మద్దతుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
తాజాగా రెహమాన్ భార్య సైరా భాను మీడియా కథనాలకు స్పందించారు. తాను ఇంకా మాజీ భార్యను కాలేదని, తాము కేవలం విడిగా ఉంటున్నాము తప్ప, విడాకులు తీసుకోలేదని వివరించారు. దూరంగా ఉంటున్నా, ఇప్పటికీ చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలమేనని కూడా సైరా భాను అన్నారు. విడాకుల కోసం దాఖలు చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తన అనారోగ్య సమస్యల కారణంగా రెహమాన్ కు అదనపు ఒత్తిడి కలగకూడదని, అందుకే తాను విడిగా జీవించాలని నిర్ణయించుకున్నానని సైరా వివరించింది. రెహమాన్ క్షేమంగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని కూడా అన్నారు. మాజీ భార్య అని పిలవడం మానేయాలని మీడియాను కోరానని కూడా సైరా చెప్పారు.
ఇటీవల సైరా భాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో తనకు రెహమాన్ అండగా నిలిచారు. దానికి ఎంతో కృతజ్ఞతాభావాన్ని కనబరిచింది. వారు విడివిడిగా ఉన్నా కానీ, కష్ట సమయంలో ఒకరికోసం ఒకరు ఉన్నారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది.. కోలుకుంటోంది...ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆమె న్యాయవాది ధృవీకరించారు. అభిమానుల ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపారు.