పుష్ప 3 రిలీజ్.. అప్పటికీ రెడీ అవుతుందా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది.;

Update: 2025-03-17 02:45 GMT

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి భాగం పుష్ప: ది రైజ్ 2021లో విడుదలై పాన్-ఇండియా హిట్ కాగా, ఇటీవల విడుదలైన పుష్ప 2: ది రూల్ అయితే మరో లెవెల్లో దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌ల లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ సినిమా తర్వాత పుష్ప 3 ఎప్పుడొస్తుందన్న ఆసక్తి పెరిగిపోయింది.

సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ హవా మరింత పెరిగింది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆయన మేనరిజమ్స్, డైలాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ముంబైలో ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్లు ఆయన్ను ఓ టాప్ హీరోలా చూశారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ అల్లు అర్జున్‌కు క్రేజ్ పెరిగింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. పుష్ప 2 విజయంతో అభిమానుల్లో పుష్ప 3 కోసం మరింత హైప్ క్రియేట్ అయింది.

సినిమా చివర్లో చూపించిన క్లైమాక్స్ సీన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పాత్ర కీలకంగా మారడం, పుష్ప క్యారెక్టర్ మరింత పవర్ఫుల్‌గా కనబడతాయని సూచించడంతో పుష్ప 3 ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. నిజానికి పుష్ప 2 రిలీజైన రోజునే పుష్ప 3 ఉండబోతుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాజాగా నిర్మాత నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు.

విజయవాడలో జరిగిన రాబిన్ హుడ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, పుష్ప 3, 2028లో వస్తుందని స్పష్టత ఇచ్చారు. అయితే అప్పటివరకు ఆల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. ప్రస్తుతం సుకుమార్, రామ్ చరణ్‌తో RC17 స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాతే పుష్ప 3 కథపై పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు, అల్లు అర్జున్ కూడా వరుసగా మూడు పెద్ద సినిమాలను లైనప్ చేసుకున్నాడు.

అట్లీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. త్రివిక్రమ్‌తో మరో డిఫరెంట్ మైథలాజికలో ప్లాన్‌లో ఉంది. అంతేకాదు, సందీప్ వంగా కూడా అల్లు అర్జున్‌తో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇలాంటి భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉండటంతో పుష్ప 3 కోసం అభిమానులు మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే, మైత్రి మూవీ మేకర్స్ 2028 అని చెప్పినప్పటికీ, పరిస్థితులు అనుకూలిస్తే ఇది ముందే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేకపోలేదన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి. మరి, పుష్ప 3 అధికారిక అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News