500 కోట్ల నుంచి.. 20 కోట్లకు పడిపోయిన నిర్మాణ సంస్థ!
అయితే వరుస డిజాస్టర్స్ తో లేటెస్ట్ గా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.;
సౌత్ ఇండస్ట్రీలో హై బడ్జెట్ చిత్రాలను నిర్మించే లైకా ప్రొడక్షన్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో 2.0, పొన్నియన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఈ సంస్థ, పాన్ ఇండియా స్థాయిలో మెగాప్రాజెక్ట్‌లను చేపట్టే కంపెనీగా పేరు తెచ్చుకుంది. అయితే వరుస డిజాస్టర్స్ తో లేటెస్ట్ గా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ముఖ్యంగా ఒకప్పుడు 2.0 సినిమాకు 500 కోట్ల వరకు ఖర్చు చేసిన ఈ సంస్థ ఇప్పుడు 20 కోట్ల రేంజ్ సినిమాకు వచ్చినట్లు టాక్ వస్తోంది. ఇటీవల, లైకా ప్రొడక్షన్స్ ఓ తెలుగు ప్రొడక్షన్ కంపెనీతో జాయింట్ వెంచర్ కోసం ప్రయత్నించిందన్న వార్తలు బయటకొచ్చాయి. హై బడ్జెట్ సినిమాలు నిర్మించే కంపెనీగా పేరు తెచ్చుకున్న లైకా, కేవలం రూ. 20 కోట్లు బడ్జెట్ ఉన్న సినిమాకు ఫైనాన్స్ కోసం మిగతా సంస్థలను ఆశ్రయించడమే ఆర్ధిక ఇబ్బందుల సూచనగా భావిస్తున్నారు.
ఇదే కాకుండా, మోహన్‌లాల్, పృథ్విరాజ్ నటిస్తున్న భారీ మలయాళ చిత్రం L2: ఎంపెరర్ విషయంలోనూ కొన్ని ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లూసిఫర్ సక్సెస్ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల తేదీ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, ఈ సినిమా అనుకున్న తేదీన విడుదల కానుందా లేదా? అన్నదానిపై స్పష్టత లేదని అంటున్నారు.
అంతేకాదు ఆర్థిక సమస్యల కారణంగా, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి జెమిని ఫిల్మ్ సర్క్యూట్స్, గోకులం ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. వీరిద్దరూ కలిసి ఈ సినిమా హక్కులను తీసుకున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ తన అసలైన ఆర్థిక స్థాయిని కోల్పోయిందా గతంలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇలా ఇతర ప్రొడక్షన్ హౌజ్‌ల సహాయాన్ని ఎందుకు ఆశ్రయిస్తోందనే డౌట్స్ వస్తున్నాయి.
కాగా, లైకా ప్రొడక్షన్స్‌పై గతంలోనూ కొన్ని రకాల ఆర్థిక చర్చలు వినిపించాయి. మరి, ప్రస్తుతం ఈ సంస్థలో నిధుల సమస్య వాస్తవమేనా లేక కేవలం వ్యాపార వ్యూహాల మార్పేనా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం L2 విషయంలో జరిగిన ఈ మార్పులు లైకా పరిస్థితిపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. ఇక ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇండస్ట్రీ వర్గాల్లో లైకా భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.