పోలిశెట్టి ప్రీవెడ్డింగ్.. ట్రెండుకు తగ్గట్టుగానే..
ఆ సినిమా తర్వాత కొత్త సినిమా ఎనౌన్స్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు.
యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత కొత్త సినిమా ఎనౌన్స్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. గతంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా హోల్డ్ పడిందనే టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ తో ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రీవెడ్డింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సినిమాపై అదిరిపోయే రేంజ్ లో మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి బర్త్ డే సందర్భంగా రాజుగాడి పెళ్లికి సంబందించిన ప్రీవెడ్డింగ్ వీడియో వదిలారు. ఈ వీడియోలో అందరికి గోల్డ్ కంచాల్లో బంతిభోజనాలు ఏర్పాటు చేసినట్లు చూపించారు.
తరువాత ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వీడియోని టీవీలో చూస్తూ డైరెక్ట్ గా అతనితోనే ముఖేష్ అంబానీ మామయ్యా అంటూ మాట్లాడటం మొదలెట్టాడు. ఆ పై ప్రీవెడ్డింగ్ షూట్ లో ఫోటోలకి ఫోజులు ఇస్తున్నట్లు చూపించారు. అందులో పెళ్లి కూతురుగా మీనాక్షి చౌదరిని రివీల్ చేశారు. ఈ వీడియోని చాలా క్రియేటివ్ గా అందరికి కనెక్ట్ అయ్యే విధంగా రెడీ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
వీడియో చూస్తుంటే ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తోనే ఉండబోతోందని అర్ధమవుతోంది. మరోసారి నవీన్ పొలిశెట్టి తనదైన శైలిలో వినోదం అందించడానికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాకి మిక్కీ జే మియర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అతనెవరనేది ఇంకా క్లారిటీ లేదు. నిజానికి గతంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అతను ‘మ్యాడ్ 2’తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మారిని దర్శకుడిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఉంటుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది.
2025లోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందని ఈ ప్రీవెడ్డింగ్ వీడియోలో స్పష్టం చేశారు. నవీన్ పొలిశెట్టి చాలా గ్యాప్ తీసుకొని ఈ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో కూడా ఈ సినిమాలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పాడు. నవీన్ పొలిశెట్టి నుంచి ఆడియన్స్ కోరుకునేది కూడా అదే. ప్రీవెడ్డింగ్ వీడియో అయితే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని చెప్పాలి. మరి ఇది ఎంత వరకు నవీన్ పొలిశెట్టిని ఆడియన్స్ కి చేరువ చేస్తుందనేది చూడాలి.