అప్పుడు హీరో రెండు చేతులు పని చేయలేదట!

విక్కీ కౌశల్ ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో నటించగా, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించింది.

Update: 2025-02-06 17:30 GMT

బాలీవుడ్‌కి ఈ ఏడాదిలోనూ ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్‌ దక్కలేదు. గత ఏడాది అత్యంత తక్కువ సక్సెస్ శాతం నమోదు అయ్యింది. తాజాగా బాలీవుడ్‌ నుంచి 'దేవా' సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించిన దేవా సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలవడంతో తదుపరి బాలీవుడ్‌ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఒకింత ఆసక్తి నెలకొంది. దేవా సినిమా తర్వాత రాబోతున్న సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వారసుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఛావా'. విక్కీ కౌశల్ ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో నటించగా, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించింది.

గత ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా 'పుష్ప 2' విడుదల కావడంతో పాటు ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. ఛావా సినిమా కోసం విక్కీ కౌశల్‌ షూటింగ్‌ సమయంలో చాలా కష్టపడ్డారు అంటూ యూనిట్‌ సభ్యులు కథలు కథలుగా చెబుతున్నారు. విడుదల సమయంలోనూ ఆయన ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నారు. రష్మిక మందన్న సైతం కాలికి గాయం అయినా స్టాండ్‌పై నడుస్తూ, వీల్‌ చైర్‌లో కూర్చుని మరీ 'ఛావా' సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటుంది. తక్కువ సమయంలోనే ఛావా సినిమాను జనాల్లో ఆసక్తి పెంచే విధంగా ప్రమోషన్స్‌ నిర్వహించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఛావా సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు లక్ష్మణ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో విక్కీ కౌశల్‌ సినిమా కోసం పడ్డ కష్టం గురించి వివరించారు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, ప్రతి ఒక్క సన్నివేశంను ప్రానం పెట్టి చేశాడంటూ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. విక్కీ కౌశల్ మొదటి సారి ఈ తరహా పాత్రలో నటిస్తున్న కారణంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విక్కీ నటించాడని దర్శకుడు అన్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ విక్కీ కౌశల్‌ కష్టం, ఆయన పట్టుదల, ఆయన పాత్రపై చూపించిన అభిమానం కనిపించబోతున్నట్లు దర్శకుడు లక్ష్మన్‌ పేర్కొన్నాడు.

ఇంకా లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఒక సన్నివేశంలో భాగంగా శంభాజీ మహారాజ్‌ను చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టడం ఉంటుంది. ఆ సన్నివేశంను రాత్రి అంతా షూట్‌ చేశాం. ఆరంభంలో చేతులు కట్టేసి రాత్రి అంతా విక్కీ కౌశల్‌ చేతులు అలాగే ఉంచాం. మొదట్లోనే ఇలా చేయాలని అనుకుంటున్నట్లు ఆయనకు చెప్పాం. ఆయన పర్వాలేదు అన్నారు. కానీ షూటింగ్‌ అంతా పూర్తి అయిన తర్వాత ఆయన చేతులు మామూలు స్థితికి రాలేదు. కొన్ని గంటల పాటు ఆయన చేతులు పని చేయకుండా అలాగే ఉండి పోయాయి. ఆ సన్నివేశం షూటింగ్‌ చేసిన తర్వాత పూర్తిగా కోలుకోవడం కోసం విక్కీకి నెలన్నర సమయం పట్టింది. షూటింగ్‌ లేకపోవడంతో సెట్‌ కూడా తొలగించేశాం.

ఆయన తిరిగి పూర్వ స్థితికి వచ్చాక, రెండు చేతుల నొప్పులు పూర్తిగా తగ్గిన తర్వాత మళ్లీ సెట్‌ వేసి షూటింగ్‌ చేశామని అన్నారు. నొప్పి విపరీతంగా వచ్చినా భరించి షూటింగ్‌ను పూర్తి చేశారని విక్కీ కౌశల్‌ పై దర్శకుడు లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి ఒక వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు ఈ సినిమాను వ్యతిరేకిస్తూ ఉంటే, కొందరు మాత్రం వెండి తెరపై శంభాజీ మహారాజ్‌ జీవితాన్ని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News