నాన్న చేసిన పని తప్పు అనుకోను.. శ్రీదేవి సవతి కొడుకు!
తల్లిదండ్రులు విడిపోవడం పాఠశాలలో తనను చాలా ఇబ్బందులకు గురి చేసిందని అర్జున్ గుర్తు చేసుకున్నాడు.
బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ తన తల్లిదండ్రులు విడిపోవడం తనను ఎలా ప్రభావితం చేసిందో.. తన తల్లి మోనా శౌరీని కోల్పోవడం.. ఆ తర్వాత అధిక బరువు పెరగడం.. స్కూల్ లో సాటి పిల్లల నుంచి ఎదురైన అనుభవాల గురించి సుదీర్ఘంగా ఇంటర్వ్యూలో చర్చించాడు. జీవితంలోని కఠినమైన పరిస్థితుల గురించి బహిరంగంగా మాట్లాడాడు.
తల్లిదండ్రులు విడిపోవడం పాఠశాలలో తనను చాలా ఇబ్బందులకు గురి చేసిందని అర్జున్ గుర్తు చేసుకున్నాడు. దానివల్ల చదువుపై దృష్టి సారించలేకపోయానని తెలిపాడు. నటనపై శ్రద్ధ పెరగడానికి, కాలేజ్ నుండి తప్పుకోవడానికి ఇది కారణమైందని కూడా చెప్పాడు. అమ్మా నాన్న విడాకులకు ముందు తాను మంచి విద్యార్థినని అర్జున్ పేర్కొన్నాడు. అయితే వారు విడిపోవడంతో ఆ గాయం తనను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ సమయంలో తినేందుకు అన్నీ ఉన్నాయి. దీంతో అధిక బరువు పెరగడానికి దారితీసిందని వెల్లడించాడు.
నాకు 10 సంవత్సరాల వయస్సులో నా తల్లిదండ్రులు విడిపోయారు. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. నెమ్మదిగా పరిణతితో ఆలోచించడం మొదలుపెట్టాను.. అమ్మతో బ్రేకప్ సమయంలో మా నాన్న రెండు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రేమ్, రూప్ కి రాణి చోరో కా రాజా సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలని చాలా ఒత్తిడిలో ఉన్నాడు. కాబట్టి నాన్నను కలవలేకపోయాను. దాంతో ఆయన నుంచి దూరం పెరిగింది. మా మధ్య ఎప్పుడూ సాధారణ తండ్రీ కొడుకుల సంబంధం లేదు. స్కూల్ కి నన్ను దింపడానికి, తిరిగి తీసుకు వెళ్లడానికి నాన్న పాఠశాలకు వచ్చాడు కానీ మాటలు ఉండేవి కావు అని తెలిపాడు.
తన తల్లిదండ్రుల బ్రేకప్ తనను జీవితంలో ప్రారంభంలో పరిపక్వం చెందేలా చేసిందని అర్జున్ అన్నాడు. నాన్న తెలిసి చేసినా అతడు హ్యాపీగా ఉన్నంత కాలం తాను చేసినది తప్పు అని నేను అనుకోనని అర్జున్ కపూర్ వ్యాఖ్యానించాడు.
నా మొదటి సినిమా `ఇషాక్‌జాదే` విడుదలకు ముందు నా 25 సంవత్సరాల వయస్సులో అమ్మను కోల్పోయాను. ఇది మరింత గాయాన్ని పెంచింది. నటనను ప్రారంభించే దశలో చాలా బాధాకరమైన సమయం. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు.. నేను నా వెన్నెముకను కోల్పోయాను అని అర్జున్ అన్నాడు. గత ఐదేళ్లుగా నన్నతో అనుబంధం మరింత పెరిగింది. ఎక్కువగా కలిసి ఉంటున్నాం. అలాగే సంఘంలో హై ప్రొఫైల్ కావడంతో మా కుటుంబానికి మంచి పేరుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాను.. అని తెలిపాడు.
నేను అల్లరి పిల్లవాడినే అయినా చదువులో కూడా ముందుండేవాడిని. అమ్మా నాన్న బ్రేకప్ తర్వాత చాలా కలత చెందాను. చదువులో మంచిగా ఉండాలనే ఆసక్తిని కోల్పోయాను. స్కూల్ లో సాటి విద్యార్థుల్లో అమ్మా నాన్న గురించి గుసగుసలు వినిపించేవి. కానీ పరిపక్వతతో వ్యవహరించానని అర్జున్ అన్నాడు. విడిపోయేప్పుడు తన తల్లిదండ్రులు గొడవపడటాన్ని తాను చూడలేదని కూడా తెలిపాడు. వారు పరిపక్వంగా విడిపోయారని కూడా అన్నాడు. అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్ కి విడాకులిచ్చేప్పటికే అతిలోక సుందరి శ్రీదేవితో నిర్మాత బోనీ కపూర్ ప్రేమలో ఉన్నారు. అటుపై శ్రీదేవిని పెళ్లాడారు. బోని-శ్రీదేవి జంటకు జాన్వీకపూర్- ఖుషీకపూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ ఇప్పుడు కథానాయికలుగా రాణిస్తున్నారు.