త‌మిళ‌నాడులో 20 సినిమాల షూటింగ్ బంద్‌!

Update: 2017-08-01 12:28 GMT
తమిళనాడులో  సినిమా షూటింగ్‌ లకు బ్రేక్ పడింది. త‌మ వేత‌నాలు పెంచాల‌ని ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ ఈఎఫ్‌ ఎస్‌ ఐ) డిమాండ్ చేస్తూ స‌మ్మెకు దిగారు. దీంతో, దాదాపు 20 సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. ఈ నిరసనలో 24 సంఘాలకు చెందిన దాదాపు 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఆ 20 సినిమాల‌లో రజనీకాంత్ సినిమా 'కాలా' కూడా ఉంది.

కొద్ది రోజులుగా నిర్మాతల సంఘానికి - కార్మికుల సంఘానికి మధ్య విభేదాలు ముదిరాయి.‘బిల్లా పాండి’ సినిమా షూటింగ్‌ సందర్భంగా వేతనాలు పెంచాలని ఆ చిత్ర నిర్మాత-నటుడు ఆర్‌కే సురేష్ డిమాండ్ చేశాడు. దీంతో, సురేష్ , ఎఫ్‌ ఈఎఫ్‌ ఎస్‌ ఐ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఆ గొడ‌వ పెద్ద‌దై మంగళవారం సమ్మె దాకా వెళ్లింది. దీంతో, ఎఫ్‌ ఈఎఫ్‌ ఎస్‌ ఐ స‌మ్మె చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ విషయంలో తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ) ప్రెసిడెంట్‌ విశాల్ జోక్యం చేసుకున్నాడు. ఎఫ్‌ ఈఎఫ్‌ ఎస్‌ ఐ సభ్యులు కానివారితో షూటింగ్‌ లు చేసుకోవాలని నిర్మాతలకు సలహా ఇచ్చాడు. ఈ స‌లహాపై సినీ న‌టి రోజా భ‌ర్త, ఎఫ్‌ ఈఎఫ్‌ ఎస్‌ ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వ‌మ‌ణి మండిప‌డ్డారు. విశాల్ సలహా కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత‌ వేతన ఒప్పందం జూలై 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో వేతన ఒప్పందం తీసుకురావాలనే డిమాండ్ తెర‌పైకి వచ్చింది. విశాల్ నటిస్తున్న సినిమా ‘తుప్పరివాలన్‌’ షూటింగ్‌ మంగళవారం కొనసాగింది.
Tags:    

Similar News