చిరంజీవి తల్లిగా ఫేమస్ మదర్

Update: 2016-08-08 06:19 GMT
తెలుగు సినిమాల్లో అత్యధికంగా అమ్మ పాత్రలు పోషించి.. వాటికే బాగా ఫేమస్ అయ్యిన వాళ్లు ఇద్దరు. ఒకరు నిర్మలమ్మ.. ఇంకొకరు అన్నపూర్ణమ్మ. ముఖ్యంగా అన్నపూర్ణ 80లు.. 90ల్లో చేసిన ప్రతి సినిమాలోనూ అమ్మ పాత్రలోనే కనిపించారు. స్టార్ హీరోలకు అమ్మ పాత్ర అనగానే ఆమే గుర్తొచ్చేవారు. మెగాస్టార్ చిరంజీవికి చాలా సినిమాల్లో అన్నపూర్ణ అమ్మగా కనిపించారు. ఐతే 90ల చివర్లోకి వచ్చేసరికి ఆమె లైమ్ లైట్లోంచి వెళ్లిపోయారు. కొన్నేళ్ల పాటు అసలు సినిమాల్లోనే కనిపించని అన్నపూర్ణ.. ఈ మధ్య ‘సరైనోడు’.. ‘అఆ’ లాంటి సినిమాల్లో బామ్మ పాత్రలో మంచి వినోదాన్ని పంచి మళ్లీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఓ పెద్ద అవకాశం వచ్చినట్లు సమాచారం.

చిరంజీవి రీఎంట్రీ మూవీలో ఆయనకు తల్లిగా అన్నపూర్ణే నటిస్తోందట. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు రెండు పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి రైతుల కోసం పోరాడే ఓ జియాలజిస్ట్ పాత్ర. ఆ పాత్రకు తల్లిదండ్రులుగా అన్నపూర్ణ.. చలపతి రావు కనిపిస్తున్నట్లు సమాచారం. పాతతరం నటీనటులైన వీళ్లిద్దరూ కూడా కొన్నేళ్లుగా పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎవరిని పెట్టుకున్నా చిరంజీవి వయసుకు తగదని భావించి అన్నపూర్ణ.. చలపతిరావులను ఎంచుకున్నారట. ఇక ఈ సినిమాలో చిరును వెన్నంటి ఉండే స్నేహితుడి పాత్రలో ఆలీ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ కోసం వేట సాగించి సాగించి.. చివరికి కాజల్ అగర్వాల్‌ ను ఫైనలైజ్ చేశారు.
Tags:    

Similar News