రొటీన్ కథలకి కేరాఫ్ నయా తెలుగు సినిమా. ఏ సినిమా చూసినా ఒకే ఫార్ములా కథలే. మొదట ప్రేమకథలు - ఆ తర్వాత భాషా టైపు కథలు, ఇంకా ఆ తర్వాత విలన్ ఇంట్లోకి హీరో చేరి సందడి చేసే ఫార్ములా కథలొచ్చాయి. ఒకొక్క ఫార్ములా కొన్నాళ్లపాటు తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అదే పనిగా విసిగించాయి. తెలుగు సినిమాలు మారవా? పక్కన తమిళ దర్శకుల్ని చూసైనా అలాంటి సినిమాలు తీయొచ్చు కదా? అన్న విమర్శలు వస్తున్న దశలో ఇటీవల టాలీవుడ్ దర్శకులు కాస్త మారారు. ట్రెండ్ మార్చి డిఫరెంట్ కథలు తెరపైకి తీసుకొస్తున్నారు. అది చూసి మనవాళ్లు కొద్దిలో కొద్దిగా మారారన్న సంతృప్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. కానీ చిత్రంగా ఇప్పుడు మన ఫార్ములా టైపు కథలు తమిళంలో తెరకెక్కుతున్నాయి. రియలిస్టిక్ సినిమాలు తీసే అక్కడి దర్శకులు ఇటీవల హీరోల ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీస్తున్నారు. అట్లీలాంటి యంగ్ డైరెక్టర్ కూడా విజయ్ తో పోలీసు సినిమాని అలాగే తీశాడు. ఆ సినిమాని చూస్తే అచ్చం తెలుగు ఫార్ములాని ఫాలో అయి తీసినట్టు అనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులైతే... ఇలాంటి సినిమాల్ని రోజుకొకటి చూస్తున్నాం, మళ్లీ మీరేంటి బాబయ్యా అదే కథ చూపించేశారు అని డైరెక్టుగా అట్లీని విమర్శిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే అట్లీ దర్శకత్వంలో మహేష్ అన్న వార్త కూడా వినిపిస్తోంది. ఆ వార్త మహేష్ అభిమానుల్లో ఒకింత కలవరానికే గురిచేస్తోందని చెప్పొచ్చు. మహేష్ తో తీస్తే తీయొచ్చు కానీ... మరీ ఇలాంటి అరిగిపోయిన కథతో మాత్రం వద్దని వేడుకొంటున్నారు. ఆ విషయాన్ని మహేష్ కి కూడా చెప్పారట ఫ్యాన్స్.