భీమ్లాకు దిష్ఠి తీస్తే వాళ్ల‌కెందుకు కోపం?

Update: 2022-02-27 14:30 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా భీమ్లా నాయ‌క్ హ‌వా కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలో భీమ్లా నాయ‌క్ వ‌సూళ్లు అద్భుతంగా ద‌క్కుతున్నాయ‌ని స‌మాచారం. తొలి మూడు రోజుల్లో వంద కోట్ల క్ల‌బ్ లో చేరిపోతోంది ఈ చిత్రం. ఇక‌పోతే అమెరికాలో  ఫ్యాన్స్ నుంచి మాసిజాన్ని బ‌య‌టికి తీసాడు భీమ్లా. అక్క‌డ థియేట‌ర్ల‌లో మ‌నోళ్ల హంగామా మామూలుగా లేదు. అంతేనా.. భీమ్లాకు దిష్ఠి తీసేందుకు ఏకంగా గుమ్మ‌డికాయ‌లు తెచ్చి దీపం వెలిగించారు.

అమెరికాలో తొలి రోజు ప్ర‌తి థియేట‌ర్ వ‌ద్దా భీమ్లా అభిమానుల వీరంగం క‌నిపించింద‌ని స‌మాచారం. భీమ్లా నాయక్ కు కొబ్బరికాయలు.. గుమ్మడికాయలు స‌హా అనేక ఇతర వస్తువులను తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు కాలిఫోర్నియాలోని థియేటర్ ముందు దిష్టి తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అక్కడ భారతీయ అభిమానులు థియేటర్ ముందు గొడవ చేయ‌డం క‌నిపిస్తోంది. ఇది థియేటర్ లో పనిచేసే అమెరికన్ సిబ్బందికి అస్స‌లు నచ్చలేదు.

అక్క‌డ వీరంగం వ‌ల్ల థియేట‌ర్ అప‌రిశుభ్రంగా మారింది. దీంతో దానిని క్లీన్ చేసేందుకు సిబ్బంది చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది.  వేలం వెర్రిగా భారతీయ అభిమానులు అఖండ - పుష్ప- భీమ్లా నాయ‌క్ వంటి చిత్రాల కోసం ఇలానే చేశారు. థియేటర్ వ‌ద్ద వీరంగం వ‌ల్ల‌ నిర్వహణ ఇబ్బందిక‌రంగా మారింది.

ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొదటిసారి కాదు. దీన్నిబట్టి చూస్తే స్టార్ హీరోల సినిమా విడుదలైతే పిచ్చి పట్టిన‌ట్టు ఫ్యాన్స్ ప్ర‌వ‌ర్తించ‌డంపై అమెరికన్లు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డుతున్నార‌ట‌. ఆస‌క్తిక‌రంగా భీమ్లా నాయ‌క్ కోసం గుమ్మ‌డికాయ‌లు కొట్టి దిష్ఠి తీసిన వారిలో మ‌హిళా ఫ్యాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.

అమెరికా మ‌రో నైజాం..!

ఇక అమెరికాలో భారతీయ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా మ‌న‌ సినిమాలు కూడా పెద్ద ఎత్తున విడుదలవుతున్నాయి. నిజం చెప్పాలంటే అమెరికా మ‌రో నైజాంలా మారుతోంది. తెలుగు సినిమాల్ని విస్తృతంగా విడుదల చేస్తుండ‌డంతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోల రిలీజుల విషయానికొస్తే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన మొదటి రోజులో పండుగ వాతావరణం ఏర్పడుతోంది. థియేట‌ర్ల వ‌ద్ద మాసిజం కూడా బ‌య‌ట‌ప‌డుతోంది.
Tags:    

Similar News