RRR కోసం కనీవినీ ఎరుగని సహకారం.. ఈ నెల 29న బిగ్ అప్డేట్..!

Update: 2021-10-27 14:14 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం) సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తర్వాత RRR నుంచి మరో అప్డేట్ రాలేదని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

 ''ఈ అక్టోబరు 29న ప్రపంచంలోని ఏ సినిమాలో మునుపెన్నడూ చూడని మరియు వినని సహకారం చూడటానికి సిద్ధంగా ఉండండి. ఇది అలా ఉండబోతోంది. అదే రోజున అద్భుతమైన #RRR అప్‌ డేట్ కోసం చూస్తూ ఉండండి'' అని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వరల్డ్ సినిమాలోనే కనీవినీ ఎరుగని కొలాబరేషన్ అని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ప్రకటించడంతో.. అది ఏమయ్యుంటుందా అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.

దుబాయ్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా ఏదైనా హాలీవుడ్ కంపెనీతో కలిసిన విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేస్తారేమో అని కామెంట్స్ పెడుతున్నారు. అలానే PVR కొలాబరేషన్ గురించిన అనౌన్స్ మెంట్ అనేవారు కూడా లేకపోలేదు. అదే రోజు ఎగ్జైటింగ్ అప్డేట్ కూడా ఉందని ప్రకటించడంతో.. 'ఆర్.ఆర్.ఆర్' నుంచి 40 సెకండ్ల వీడియో రాబోతోందని కామెంట్స్ రూపంలో వెల్లడిస్తున్నారు. ఏదేమైనా చాలా రోజులుగా సైలెంట్ గా ట్రిపుల్ ఆర్ మేకర్స్.. ఈ నెల ఏదొక ప్రకటన ఇస్తున్నారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ కథాంశంతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్ - భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఆర్.ఆర్.ఆర్' ప్రచార చిత్రాలు - ఇద్దరు హీరోల స్పెషల్ టీజర్లు - 'దోస్తీ' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి. దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News