బీహార్ లో వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయబోతున్నారా...?

Update: 2020-06-24 08:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ చేసుకొని మరణించడం యావత్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సుశాంత్ తన ప్లాట్ లో ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఉండే నెపోటిజం మరియు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేకపోవడం వలన కనీస గౌరవం ఇవ్వ లేదని.. అతన్ని అన్ని విధాలుగా తొక్కేశారని కామెంట్స్ చేస్తున్నారు. గత ఆరు నెలల్లో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సుశాంత్ ని బ్యాన్ చేయడం తో సైన్ చేసిన ఏడు సినిమాలు దూరమయ్యాయని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సుశాంత్ మరణానికి బాధ్యులను చేస్తూ సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి బాలీవుడ్ ప్రముఖుల పై పలు ఏరియాల్లో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా వీరందరిని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫాలో అవుతున్నవారు అన్ ఫాలో చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ బీహారీ కావడం వలనే అతన్ని ఇంతగా వేధించారన్న వాదం కొత్త గా తెర పైకి వచ్చింది.

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ బీహార్ కి చెందిన వాడు కావడంతో అతని కి అవకాశాలు రాకుండా చేసి అతని మరణానికి కారణమయ్యారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇకపై బీహార్ రాష్ట్రంలో వారి సినిమాలు బ్యాన్ చేయాలని బీహారీలు డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ డిప్రెషన్ కి కారణమైన వారిగా విమర్శలు ఎదుర్కుంటున్న సల్మాన్ ఖాన్, అలియా భట్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారికి సంబందించిన చిత్రాలు బీహార్ లో బ్యాన్ చేయాలని అంటున్నారట. ఇప్పటి నుండి వారు నిర్మించిన చిత్రాలు.. యాక్ట్ చేసిన సినిమాలు ఇక్కడ రిలీజ్ కానివ్వం అని వారు పట్టుదలతో ఉన్నారట. ఇదే కనుక జరిగి బీహార్ లో  బాలీవుడ్ సినిమాలు బ్యాన్ చేస్తే మార్కెట్ పరంగా వారికి పెద్ద దెబ్బ పడే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Tags:    

Similar News