నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్న వార‌సురాళ్లు

అయితే సినీ నిర్మాణ‌మేమీ ఆషామాషీ కాదు. ఎన్నో ఛాలెంజెస్‌, ఎన్నో క‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.;

Update: 2025-03-07 07:26 GMT

ఒక‌ప్పుడు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ వారి కొడుకులే సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చే వారు. కానీ ఇప్పుడు కూతుళ్లు కూడా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌మదైన స‌త్తా చాటుతున్నారు. కేవ‌లం హీరోయిన్లుగా మాత్ర‌మే కాకుండా సినిమాకు చెందిన ప‌లు విభాగాల్లో రాణిస్తున్నారు. అందులో అంద‌రూ ఎక్కువ‌గా నిర్మాణ రంగంవైపే అడుగులేస్తున్నారు.

అయితే సినీ నిర్మాణ‌మేమీ ఆషామాషీ కాదు. ఎన్నో ఛాలెంజెస్‌, ఎన్నో క‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో పాటూ మంచి క‌థ‌ల‌ను ప‌ట్టుకునే సామ‌ర్థ్యం, అన్నింటినీ త‌ట్టుకునే ఓపిక కూడా కావాలి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో 50 ఏళ్ల‌కు పైగా అనుభ‌వ‌మున్న వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వినీద‌త్ కూతుళ్లు స్వ‌ప్న‌, ప్రియాంక‌లు ఇప్పుడు ఆ సంస్థ బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు. స్వప్న సినిమాస్, త్రీ ఏంజెల్స్ స్టూడియో, ఎర్లీ మాన్‌సూన్ టేల్స్ లాంటి బ్యాన‌ర్ల‌ను నిర్మించి ఓ వైపు సినిమాలు తీస్తూనే మ‌రోవైపు ఓటీటీ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేస్తూ త‌మ స‌త్తా చాటుతున్నారు.

ఇక రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు సొంత బ్యాన‌ర్ గోపీకృష్ణ మూవీస్ కు కూడా మంచి పేరుంది. ఆ బ్యాన‌ర్ బాధ్య‌త‌ల్ని ప్ర‌స్తుతం కృష్ణం రాజు కూతురు, ప్ర‌భాస్ సోద‌రి ప్ర‌సీద ఉప్ప‌ల‌పాటి చూసుకుంటున్నారు. ఆమె ప్ర‌భాస్ తో రాధే శ్యామ్ సినిమాను తీసిన విష‌యం తెలిసిందే. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో రూపొందే సినిమాల బాధ్య‌త‌ల్ని సుప్రియ యార్ల‌గ‌డ్డ చూసుకుంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముందు హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సుప్రియ‌ త‌ర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది.

సూప‌ర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా ఇందిరా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ కు నిర్మాత అనే విష‌యం తెలిసిందే. పోకిరి, ఏ మాయ చేసావె లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలకు మంజుల నిర్మాణ భాగస్వామిగా వ్య‌వ‌హ‌రించింది. వీరితో పాటూ చిరంజీవి, బాల‌కృష్ణ కుటుంబాల నుంచి కూడా వారి వార‌సురాళ్లు ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. బాల‌య్య రెండో కూతురు తేజ‌స్విని లెజెండ్ ప్రొడ‌క్ష‌న్స్ అనే బ్యాన‌ర్ ను స్థాపించి, అందులో మొద‌టి సినిమాను మోక్ష‌జ్ఞ‌తో ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయింది. దాంతో పాటూ అఖండ‌2 కు కూడా తేజ‌స్విని సమ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల మొద‌ట కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ప‌లు సినిమాల‌కు డిజైన‌ర్ గా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ ను మొద‌లుపెట్టి ప‌లు సిరీస్‌లను నిర్మించింది. త్వ‌ర‌లోనే త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తీయాల‌నే ప్ర‌య‌త్నాల్లో సుస్మిత ఉంది.

మెగా ఫ్యామిలీ నుంచి సుస్మిత తో పాటూ నాగ‌బాబు కూతురు నిహారిక కూడా సినీ ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా కొన‌సాగుతుంది. మొద‌ట యాంక‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నిహారిక త‌ర్వాత ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాలు చేసింది. రీసెంట్ గా పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో క‌మిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించి మంచి హిట్ ను అందుకుంది నిహారిక‌.

మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి కూడా ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌ను నిర్మించింది. ఓ వైపు న‌టిగా స‌త్తాను చాటుతూనే ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లో సినిమాల‌ను నిర్మించింది ల‌క్ష్మి. వీరితో పాటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వార‌సులు కూడా నిర్మాణ రంగంలో త‌మ స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే దిల్ రాజు కూతురు హ‌న్షిత రెడ్డి దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో కొన్ని సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ టి.జి విశ్వ‌ప్ర‌సాద్ కూతురు కృతి ప్ర‌సాద్ కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. హారిక హాసినీ క్రియేష‌న్స్ అధినేత చిన‌బాబు కూతురు హారిక కూడా మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాలకు నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తోంది. త్రివిక్ర‌మ్ భార్య కూడా ఫార్చూస్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ లో సినిమాల‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. వీరితో పాటూ సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్, నాని సోద‌రి ప్ర‌శాంతి, నితిన్ సోద‌రి నిఖితా రెడ్డి, డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ కూతురు నీలిమ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారే.

Tags:    

Similar News