దేవర విలన్ వారసుడి డెబ్యూ.. సత్తా చాటాడా లేదా?
ఇప్పుడు దేవర విలన్ సైఫ్ ఖాన్ నటవారసుడు ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. అతడు నటించిన నాదనియాన్ ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.;
నటవారసులను తెరకు పరిచయం చేయడం అంటే సవాళ్లతో కూడుకున్నది. తండ్రితో ప్రారంభ సినిమాకే పోలికలు చూస్తారు ప్రేక్షకులు. నచ్చకపోతే నచ్చలేదని సూటిగా చెప్పేస్తారు. ఎంత బాగా నటించినా షాకులెన్నో చెప్పేవాళ్లు ఉంటారు. రామ్ చరణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లు ఆరంగేట్రం చేసినప్పుడు కూడా ఇలాంటివి చూశాం.
అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వారసులను పరిచయం చేసేందుకు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. కథా చర్చలు మొదలు సినిమా పూర్తయ్యేవరకూ ప్రచారం కోసం వారి తండ్రులు చాలా సహకరిస్తారు. అభిమానుల అంచనాలను చేరుకునేలా పుత్రరత్నాలను తీర్చిదిద్దేందుకు ప్రిపరేషన్ తో ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా బాలీవుడ్ లో డెబ్యూ హీరోల పరిచయం షాకిస్తోంది. వీళ్లు ప్రారంభమే హిట్లు కొట్టనవసరం లేదు. ఇండస్ట్రీని ఏలాల్సిన అవసరం లేదు! అన్నట్టే వారి పరిచయం సాగుతోంది.
ఇటీవల అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో తన వారసుడిని పరిచయం చేసేప్పుడు కొంత జాగ్రత్త తీసుకోగలిగారు కానీ, అతడికి ప్రజల నుంచి ఆశించిన రెస్పాన్స్ లేదు. మహారాజా చిత్రంతో అమీర్ వారసుడు జునైద్ తెరకు పరిచయం అయ్యాడు. తదుపరి 'లవ్ యాపా' టైటిల్ తో రూపొందిన ఈ సినిమాతో శ్రీదేవి నటవారసురాలు ఖుషి కపూర్ వెండితెరకు పరిచయమైంది. ఆరంగేట్రమే ఆ ఇద్దరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు దేవర విలన్ సైఫ్ ఖాన్ నటవారసుడు ఇబ్రహీం అలీఖాన్ తెరంగేట్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. అతడు నటించిన నాదనియాన్ ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కూడా ఖుషి కపూర్ కథానాయిక. ఇక ఇబ్రహీం, ఖుషీ జంట నటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీం లుక్స్ బావున్నా కానీ నటుడిగా చాలా పరిణతి చెందాల్సి ఉంది. ఖుషి కపూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని సమీక్షకులు తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యంగా నాదనియాన్ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానాన్ని కూడా జనం తూర్పారబట్టారు. ఒకటికి మించి అంశాలను టచ్ చేస్తూ, ఈ సినిమాని కలగాపులగం చేసారని విమర్శలొచ్చాయి. ఇకపోతే ఇబ్రహీం అలీఖాన్ దాదాపు 2000 కోట్ల ఆస్తులకు వారసుడు. అయినా అతడిని హీరోగా పరిచయం చేసేందుకు సైఫ్ ఖాన్ ఎలాంటి హంగామాను సృష్టించలేదు. అనవసర ఖర్చు చేయలేదు. మీడియాని కూడా అతడు బతిమాలుకోలేదు. ఒక సాధాసీదా యువకుడిలా ఇబ్రహీం నటనలోకి అడుగుపెట్టాడు. నెక్ట్స్ అతడికి అవకాశాలకు కొదవేమీ లేదు. తదుపరి తన కెరీర్ రెండో ప్రాజెక్ట్ లోను ఇబ్రహీం నటిస్తున్నాడు. ఇకపోతే ఖుషీకపూర్ తనను తాను చాలా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. జాన్వీతో పోలిస్తే ఖుషి అంతగా ఆకట్టుకోవడం లేదు. అయితే నటించే ప్రతి సినిమాకి ఖుషి పరిణతి చెందే అవకాశం ఉంటుంది.