బాక్సాఫీస్: 2021 ఫిబ్ర‌వ‌రి నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా..!

Update: 2021-03-01 06:51 GMT
వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో 90 ఏళ్లుగా టాలీవుడ్ ఉనికిని చాటుకుంటూనే ఉంది. తెలుగు చ‌ల‌న చిత్ర సీమ అంత‌కంత‌కు అనూహ్యంగా వృద్ధి చెందుతోంది. ఒక ర‌కంగా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచేలా పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది.

అయితే ఇన్నేళ్ల‌లో ఏనాడూ ఫిబ్ర‌వ‌రిలో రిలీజైన సినిమాలు బంప‌ర్ హిట్లు కొట్టిన‌వి భారీ ఓపెనింగులు తెచ్చిన‌వి లేనే లేవు.రేర్ గా అగ్ర హీరోల‌కు మాత్ర‌మే ఆ అవ‌కాశం ద‌క్కింది కానీ కొత్త వాళ్లు.. మీడియం రేంజు సినిమాల‌కు అంత సీన్ లేదు ఎప్పుడూ. అయితే క‌రోనా క్రైసిస్ అంతా మార్చేసింది. 2020 ఫిబ్ర‌వ‌రి ఎంత వీక్ గా న‌డిచిందో.. దానికి పూర్తి ఆపోజిట్ గా 2021 ఫిబ్ర‌వ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల్ని పండించి గ్రాండ్ స‌క్సెసైంది.

నిజానికి ఫిబ్రవరి సినిమాలకు సోసోనే. మార్చి టెన్ష‌న్ ఎప్పుడూ ఇబ్బందిక‌రం. అయితే ఈసారి ఆ టెన్ష‌న్ లేదు. మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ 2020 వేసవిలో రావాల్సిన‌వ‌న్నీ 2021 కి వాయిదా ప‌డ‌డంతో అవ‌న్నీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి- మార్చి- ఏప్రిల్ సీజ‌న్ లో వ‌రుస‌గా విడుద‌ల‌వుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో వారం వారం రెండు మూడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. జాంబీ రెడ్డితో నెల ప్రారంభమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చ‌క్క‌గా ఆర్జించింది. ఆ వెంట‌నే చిన్న సినిమాల్లో అతిపెద్ద హిట్ ‌గా ఉప్పెన రికార్డుల‌కెక్క‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఈ చిత్రం రికార్డు ఓపెనింగుల‌తో ప్రపంచవ్యాప్తంగా రూ .50 కోట్ల షేర్ క్ల‌బ్ (100 కోట్ల గ్రాస్) కు చేరువైంది. ఇప్ప‌టికీ వారాంతంలో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అలాగే అల్లరి నరేష్ ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. `నాంది` కొన్ని చిత్రాలతో పోటీప‌డుతూ రిలీజైనా పెద్ద విజ‌యం సాధించింది. డ‌బ్బుకు డ‌బ్బు అలాగే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఫిబ్ర‌వ‌రిలో ఉప్పెన బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే జాంబీ రెడ్డి- నాంది ఈ విజ‌యాన్ని కొన‌సాగించాయి.

ఇటీవ‌ల విడుద‌లైన నితిన్ కొత్త చిత్రం చెక్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. థియేట‌ర్ల‌లోనూ అంతంత మాత్రంగానే ఆడుతోంది. విశాల్ చక్ర .. సుమంత్ కపట‌ధారి బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన రేంజుకు వెళ్ల‌డంలో విఫలమయ్యాయి.

ఏదేమైనా క్రైసిస్ పూర్తిగా తొల‌గిపోక ముందు టాలీవుడ్ నెమ్మ‌దిగా కోలుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేలా ఒక మంచి ఫిబ్రవరిని ఈ ఏడాది కలిగి ఉందన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. విద్యార్థుల‌కు మార్చి ప‌రీక్ష‌ల టెన్ష‌న్ లేక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి థియేట‌ర్ల‌లో టికెటింగుకు క‌లిసొచ్చింది.
Tags:    

Similar News