వెండితెర‌కు విశ్రాంతి.. తెలుగోళ్ల‌కు ఇబ్బందే!

Update: 2018-03-02 05:15 GMT
అవున‌న్నా కాద‌న్నా.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సినిమాల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అంద‌రూ క‌లిస్తే స‌ర‌దాగా కూర్చొని మాట్లాడుకుందాం.. ఎక్క‌డికైనా తిరుగుదామ‌ని అనుకుంటారు. కానీ.. ఇద్ద‌రు తెలుగోళ్లు క‌లిస్తే.. స‌ర‌దాగా గ‌డిపేందుకు  వారు చేసుకునే ప్లాన్ లో సినిమా ప‌క్కాగా ఉంటుంది. ఫ్రెండ్స్ కావొచ్చు..ప్రేమికులు కావొచ్చు.. కుటుంబ స‌భ్యులు కావొచ్చు.. ఆఫీస్ కొలీగ్స్ కావొచ్చు.. ఎవ‌రైనా స‌రే.. ఎంజాయ్ చేద్దామ‌న్న ప్లాన్ లో సినిమా త‌ప్ప‌నిస‌రి.

మ‌రి.. అలాంటి సినిమా ఈ రోజు నుంచి బంద్ అయిపోయింది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు భారంగా త‌యారైన డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్స్ ఛార్జీల్ని వ్య‌తిరేకిస్తూ ఈ రోజు (శుక్ర‌వారం) నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట‌ర్ల‌ను బంద్ చేస్తున్నారు.

కంటెంట్ ప్రొవైడ‌ర్ల‌కు.. సినీ వ‌ర్గాల‌కు మ‌ధ్య న‌డుస్తున్న లొల్లిలో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కాస్త అటుఇటూగా ఉన్నా.. స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు మాత్రం మకుంప‌ట్టుతో ఉన్నాయ‌ని.. అందుకే థియేట‌ర్ల‌ను బంద్ పెట్ట‌టం మిన‌హా మ‌రో మార్గం లేద‌ని చెబుతున్నారు. అదేం సిత్ర‌మో కానీ.. ద‌క్షిణాదిలోనే ఈ ద‌రిద్ర‌మంతా. ఇవే కంపెనీలు ఉత్త‌రాది రాష్ట్రాల్లో మాత్రం ఆయా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లు చెప్పిన‌ట్లుగా బుద్దిగా మాట వింటున్న‌ట్లు చెబుతున్నారు.

పంచాయితీలు ఎన్ని ఉన్నా.. ఈ రోజు నుంచి సినిమాలు బంద్ అయిన‌ట్లే. సినిమాలు చూడాలంటే అయితే.. ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవ‌ట‌మే త‌ప్పించి.. థియేట‌ర్ల‌కు వెళ్లి చూడలేని ప‌రిస్థితి. తెలుగోళ్ల జీవితాల్లో భాగ‌మైన సినిమా లేకుండా ఎలా ఉంటారో చూడాలి. థియేట‌ర్ల చుట్టూ జ‌రిగే వ్యాపారం.. తాజా బంద్ కార‌ణంగా ఎంత ప్ర‌భావితం అవుతుందో చూడాలి. ఏమైనా.. తెలుగోళ్ల‌కు ఇష్ట‌మైన సినిమాను దూరం చేసిన స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల‌కు త‌గిన శాస్తి జ‌ర‌గాల్సిందేనన్న శాపం ప్ర‌తి తెలుగోడు పెట్ట‌టం ఖాయం.

Tags:    

Similar News