గుహ లోంచి ముంబై వీధుల్లోకి.. షాకిచ్చిన‌ స్టార్ హీరో గెట‌ప్

అద్భుత‌మైన క‌థ‌లు, అసాధార‌ణ పాత్ర‌ల‌తో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ గా అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది.;

Update: 2025-02-01 07:45 GMT

అద్భుత‌మైన క‌థ‌లు, అసాధార‌ణ పాత్ర‌ల‌తో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ గా అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది. ఖాన్ ఓ సినిమాలో న‌టిస్తున్నారు అంటే ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఒక కేవ్‌మేన్ అవ‌తారంలో అత‌డు సృష్టించిన అల‌జ‌డి అంతా ఇంతా కాదు. బాగా పెరిగిన గిర‌జాల జుత్తు... గుబురు గ‌డ్డం.. కోర మీసం.. చినిగిన నార బ‌ట్ట‌లు ధ‌రించి అత‌డు వీధుల‌లో చేసిన హ‌డావుడికి జ‌నం ఖంగు తిన్నారు.

అత‌డు వీధుల్లో తిరుగుతున్న‌ప్పుడు ఎవ‌రూ గుర్తు పట్ట‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అమీర్ ఖాన్ కొత్త వేష‌ధార‌ణ ర‌క‌ర‌కాల‌ ఊహాగానాలకు దారితీసింది. ఈ వేషం దేనికోసం? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌కుముందు పీకే చిత్రంలో న‌గ్నంగా క‌నిపించి షాకిచ్చాడు. కేవ‌లం ఒక రేడియోను మాత్రం అడ్డు పెట్టుకుని అత‌డు వీధుల్లో వెళ్లే ఫోటో, వీడియో చాలా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇప్పుడు ఈ కేవ్ మేన్ గెట‌ప్ దేనికోసం? బ‌హుశా అత‌డు పీకే 2 కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నాడా? అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే చివ‌ర‌కు రహస్యం ఓపెనైంది. అమీర్ విచిత్రమైన గెట‌ప్ కి కార‌ణం వేరే ఉంది. ఇదంతా యాక్షన్-ప్యాక్డ్ థమ్స్ అప్ వాణిజ్య ప్రకటనలో భాగం అని తెలిసింది.

శుక్రవారం నాడు ప్ర‌క‌ట‌న విడుద‌ల కాగా, అత‌డి వేష‌ధార‌ణ గురించి యువ‌త‌రంలో చాలా చ‌ర్చ సాగింది. ఆమిర్ ఖాన్ ఎప్ప‌టిలానే కేవ్ మ్యాన్ (గుహ‌లో మునీశ్వ‌రుడు) గెటప్ కోసం వంద‌శాతం ఎఫ‌ర్ట్ పెట్టాడు. హిస్టారిక‌ల్ గుహ నేపథ్యం.. గుహ వాసులు- కేవ్ మహిళల బృందంతో వింతైన‌ నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. అమీర్ అసాధారణ కదలికలు, ఎన‌ర్జీ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించాయి. ఇదంతా థ‌మ్సప్ ప్ర‌క‌ట‌న కోసం హంగామా అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

ప్రకటన విడుదలకు ఒక రోజు ముందు ఆమిర్ తన కేవ్ మ్యాన్ దుస్తులలో ముంబై వీధుల్లో తిరుగుతూ, రిక్షాను తోసుకుంటూ రోడ్ల‌పై వెళ్లే వారితో క‌లిసిపోయి కనిపించాడు. చిరిగిన జుట్టు, గుబురు గడ్డం, చినుగుల‌ గోధుమ రంగు వస్త్రాలతో.. వాహ‌నాల మ‌ధ్య‌, పాదచారుల మధ్య నడుస్తున్న అత‌డిని ఎవ‌రూ గుర్తుపట్టలేకపోయారు. తెరవెనుక దృశ్యాలు అమీర్ మేకోవ‌ర్ కోసం ఎంత కృషి చేశాడో అర్థం చేసుకోవ‌చ్చు. ప్రోస్తేటిక్స్, మేకప్ విగ్గులను ఎంత జాగ్రత్తగా సెట్ చేసారో దీనికోసం అమీర్ ఎంతగా ట్రాన్స్ ఫామ్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... లాల్ సింగ్ చద్దా తర్వాత అమీర్ ఖాన్ `తారే జ‌మీన్ పర్ సీక్వెల్` అయిన `సితారే జమీన్ పర్`లో న‌టిస్తున్నాడు. దర్శీల్ సఫారీ, జెనీలియా దేశ్‌ముఖ్‌ల తో కలిసి అత‌డు న‌టించాడు. త‌న‌యుడు జునైద్ న‌టించిన `ల‌వ్ యాపా` చిత్రాన్ని అమీర్ ప్ర‌మోట్ చేస్తున్నాడు.

Tags:    

Similar News