బిపాసా పోస్ట్ ఆ సింగర్‌కు కౌంటరేనా?
ఇప్పటికే మికా సింగ్, బిపాసా దంపతులపై పలుమార్లు కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు.;
ప్రముఖ సింగర్ మికా సింగ్ గత కొన్నాళ్లుగా బాలీవుడ్ నటి బిపాసా బసు, ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మికా సింగ్, బిపాసా దంపతులపై పలుమార్లు కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు. బిపాసా, కరణ్ సింగ్ వల్ల ఆర్థికంగా తానెంతో నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారాయన.
ఈ నేపథ్యంలో తాజాగా బిపాసా నెట్టింట షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. విషపూరిత స్వభావం కలిగిన వ్యక్తులు గొడవలు సృష్టిస్తారు. తప్పు ఎవరిదైనా సరే నిందలు మాత్రం ఎదుటి వారి మీదే వేస్తారు తప్పించి తమ వల్ల జరిగిన తప్పుకు నైతిక బాధ్యత మాత్రం వహించరని, అలాంటి వారికి ఎప్పుడూ దూరంగానే ఉండాలని రాసి ఉన్న పోస్ట్ ను షేర్ చేసింది.
గత కొన్నాళ్లుగా సింగర్ మికా సింగ్ తనపై, తన భర్తపై చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకే ఇన్‌డైరెక్ట్ గా ఆయన కోసమే బిపాసా ఈ పోస్ట్ ను షేర్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే బిపాసా, ఆమె భర్త కరణ్ సింగ్ జంటగా నటించిన డేంజర్ అనే వెబ్ సిరీస్ ను మికా సింగ్ నిర్మించాడు.
డేంజర్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం లండన్ వెళ్లామని, అక్కడ షూటింగ్ కు వెళ్లినప్పుడు బిపాసా, తన భర్త షూటింగ్ కు రావడానికి నిరాకరించేవారని ఆయన ఆరోపణలు చేశాడు. బిపాసా, కరణ్ సింగ్ వల్లే రూ.4 కోట్లలో పూర్తవ్వాల్సిన బడ్జెట్ రూ.14 కోట్లకు చేరిందని, వారిని చూశాక అసలు నిర్మాతను ఎందుకయ్యానా అని బాధపడ్డానని మికా సింగ్ చెప్పాడు. తనకు చేసిన ఆర్థిక నష్టం వల్లే బిపాసా దంపతులకు ఇప్పుడే పనీ లేకుండా పోయిందని మికా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఇక బిపాసా విషయానికొస్తే మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె, తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ, తెలుగు, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించిన బిపాసా పలు భాషల్లోని స్టార్ హీరోల సరసన నటించిన భారీ క్రేజ్ దక్కించుకుంది. బిపాసా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 15 ఏళ్లవుతున్నా ఇంకా తన అందంతో అమ్మడు మంచి ఫాలోయింగ్ తో కొనసాగుతుంది.